కరెంట్‌ షాక్‌ ఇచ్చి.. ఊరి బయట పడేసి..

31 Mar, 2018 22:05 IST|Sakshi

సాక్షి, లక్నో: సాధారణ కూలీ.. ఎదుటి వారికి ఏమీ చెప్పలేడు. తనకు ఏం చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే అతనో మూగ, చెవిటితో బాధపడే దివ్యాంగుడు. అలాంటి వాడిని దొంగతనం నేరం మోపి చిత్రవధ పెట్టాడు అతని యజమాని. చెప్పుకోలేని విధంగా హింసించాడు. శరీరంలోని అతి సున్నిత భాగాలకు సైతం కరెంట్‌ షాక్‌ ఇచ్చి నరకం చూపించాడు. అనంతరం ఎవరీ తెలియకుండా ఊరికి దూరంగా పడేసి వచ్చాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... ఉత్తరప్రదేశ్‌లోని  షహజహనాపూర్‌కు చెందిన కమలేష్‌ కుమార్‌ చెవుడు, మూగతో బాధపడే దలిత దివ్యాంగుడు. ఇతను యోగేష్‌ వర్మ అనే వ్యక్తి వద్ద పనిచేస్తున్నాడు. అయితే గత గురువారం పనికి వెళ్లిన కమలేష్‌ కనిపించకుండా పోయాడు. శుక్రవారం ఉదయం కొత్తబస్తీ ప్రాంతంలో స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అనంతరం మెలుకువ వచ్చి ఇంటికి చేరుకొని యజమాని తనని ఏవిధంగా హింసించాడో కుటుంబ సభ్యులకు తనదైన శైలిలో వివరించాడు. డబ్బు దొంగతనం చేశాడనే అనుమానంతో కర్రలు, ఇనుప రాడ్‌లతో కొట్టినట్లు చెప్పాడు. అంతేకాకుండా శరీరంలోని సున్నిత భాగాలకు విద్యుత్‌ షాక్‌ ఇచ్చి చిత్ర హింసలు పెట్టారని రోదించాడు. స్పృహ తప్పిపడిపోయిన తనను దూరంగా తీసుకువచ్చి పడేశాడని వాపోయాడు. 

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కమలేష్‌ శరీరంపై కాలిన మచ్చలు ఉన్నాయని, అతడిని తీవ్రంగా హింసించారని పోలీసులకు తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు యజమాని యోగేష్‌ వర్మపై ఐపీసీ 323తోపాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని  వెల్లడించారు.

మరిన్ని వార్తలు