మైనర్‌పై అత్యాచారం.. వృద్ధుడికి మరణ శిక్ష

19 Jan, 2020 08:25 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : అన్నెం పున్నెం ఎరుగని బాలికపై కోలారు జిల్లాలో వృద్ధుడు పంజా విసిరాడు. కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న అమ్మాయిపై ఇద్దరు దుండగులు అకృత్యానికి పాల్పడి ప్రాణాలు తీశారు. ఈ రెండు కేసుల్లో దోషులకు న్యాయపీఠాలు ఉరిశిక్షను విధిస్తూ తీర్పు చెప్పాయి. మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో 65 యేళ్ల వృద్ధునికి మరణ శిక్షను విధిస్తూ కోలారు రెండవ సెషన్స్‌ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తాలూకాలోని భైరండహళ్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప శిక్షకు గురైన వ్యక్తి. వెంకటేశప్ప 2018 మే నెల 1వ తేదీన అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికకు మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకు వెళ్లి లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై వేమగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు వెంకటేశప్పపై పోక్సో కేసు దాఖలు చేశారు. విచారణంలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి బిఎస్‌ రేఖ ఈ మేరకు తీర్పును వెలువరించారు.

శృంగేరిలో విద్యార్థినిపై హత్యాచారం కేసులో..  
చిక్కమగళూరు జిల్లా శృంగేరిలో కాలేజీ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన కేసులో ఇద్దరు దోషులకు చిక్కమగళూరు ప్రత్యేక కోర్టు మరణశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. 2016 ఫిబ్రవరి 16న శృంగేరి తాలూకా మెణసె గ్రామానికి చెందిన కాలేజీ విద్యార్థినిపై ఇద్దరు నిందితులు అత్యాచారం చేసి హత్య చేశారు. పాడుబడిన బావిలో మృతదేహాన్ని పడేసి పరారయ్యారు. విద్యార్థిని మంగళూరులో పీయుసీ పరీక్ష రాసి బస్‌లో మెణసెకీ వచ్చింది. అక్కడ నుండి నడిచి వెళ్లుతుండగా ఆదే ఊరుకు చెందిన సంతోష్, ప్రదీప్‌లు విద్యార్థిని నోరుమూసి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అఘయిత్యానికి ఒడిగట్టి ప్రాణం తీశారు. ఈ సంఘటనను గుర్తించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే గ్రామానికి చెందిన సంతోష్, ప్రదీప్‌లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసి అరెస్ట్‌ చేశారు. కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారించిన చిక్కమగళూరు ప్రత్యేక జడ్జి ఎం.ఉమేశ్‌ అడిగ.. నిందితులు ఈ ఘోరం చేసినట్లు నిరూపణ కావడంతో శనివారం పై విధంగా తీర్పు వెలువరించారు. కాగా ఈ ఘాతుకంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంఘాలు ఆందోళనలు నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా