ఏటీఎంలలో జరభద్రం!

16 May, 2018 11:27 IST|Sakshi
రుమేనియాకు చెందిన నిందితులు

డెబిట్‌ కార్డులను క్లోనింగ్‌ చేస్తున్న ముఠాలు

సెక్యూరిటీలేని ఏటీఎంలపై అంతర్జాతీయ నేరగాళ్ల కన్ను

తొలుత కార్డ్‌ రీడర్‌ కిందమ్యాగ్నెట్‌...

పిన్‌ నంబర్‌ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు

స్కిమ్‌ కార్డుల ద్వారా డాటా తస్కరణ, ముంబైలో క్లోనింగ్‌

ఇద్దరు రుమేనియన్ల అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: ‘డబ్బులు డ్రా చేసుకునేందుకు నగరంలోని ఏటీఎం కేంద్రాలకు వెళుతున్నారా...యథాలాపంగా ఏటీఎం యంత్రంలో కార్డు పెట్టి కీబోర్డు మీద పాస్‌వర్డ్‌ కొట్టి చకచకా డబ్బులు తీసుకొని వెళ్లిపోదామని అనుకుంటే మీ ఖాతాల్లోని డబ్బులకు గ్యారంటీ ఉండకపోవచ్చు. నగరంలోని ఏటీఎం కేంద్రాల్లో డేటా కార్డ్‌ రీడర్‌ అమర్చి ఉన్న స్కిమ్మర్‌ కార్డును బిగించి ఏటీఎం కార్డు వివరాలన్నీ సేకరించడంతో పాటు అక్కడే బిగించిన రహస్య సీసీటీవీ కెమెరా ద్వారా పిన్‌ నంబర్‌ తెలుసుకొని ముంబైలో క్లోనింగ్‌ చేసి భారీ మొత్తంలో అక్కడి ఏటీఎంల నుంచి డబ్బులను కాజేస్తున్న ఇద్దరు రుమేనియా దేశస్తులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ నగదును తమ దేశ కరెన్సీలోకి మార్చుకునేందుకు నగరానికి వచ్చిన ప్రధాన నిందితులు వసిలె గాబ్రియల్‌ రజ్వాన్, బురిసియా అలెగ్జాండ్రు మిహయ్‌లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.35 లక్షల నగదుతో పాటు 196 స్కిమ్మర్‌ కార్డులు, ఆరు కెమెరా ప్యానెల్స్, ఒక ఎంఎస్‌ఆర్‌ మెషిన్, ఆరు ఏటీఎం కార్డు స్కిమ్మర్‌లు, రెండు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 4న తన బ్యాంక్‌ ఖాతా నుంచి ముంబై, గోరేగావ్‌లోని ఓ ఏటీఎం సెంటర్‌ నుంచి లక్ష రూపాయలు డ్రా అయ్యాయని మెసేజ్‌ వచ్చిందంటూ కూకట్‌పల్లివాసి అనిల్‌ భార్గవ ఫిర్యాదుతో ఈ భారీ క్లోనింగ్‌ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మంగళవారం మీడియాకు తెలిపారు. 

మెకానిక్‌ నుంచి చోరీలవైపు...    
రొమానియాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వసిలె గాబ్రియల్‌ రజ్వాన్‌ అక్కడే కారు మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని స్నేహితుడైన బురిసియా అలెగ్జాండ్రు మిహయ్‌ హోటల్‌లో పనిచేస్తుండేవాడు. అయితే వీరి అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు సంపాదించకపోవడంతో నేరాలబాట పట్టారు. వీరికి రజ్వాన్‌ స్నేహితులైన టికూ బొగ్దాన్‌ కాస్టినెల్, పుయికా ఇగ్ను మరియన్‌లు కూడా తోడయ్యారు. ఇలా యూకే, యూరోపియన్‌లలోనూ ఏటీఎం కార్డులు క్లోనింగ్‌ చేసి వివిధ బ్యాంక్‌ ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకునేవారు. అక్కడ నిఘా పెరగడంతో వీరి చూపు భారతదేశంలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీపై పడింది. ఇలా వీరు బిజినెస్, టూరిస్ట్‌ వీసాలపై గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌కు వచ్చారు. నగరంలోని హోటల్స్‌లో ఉండి సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలను గుర్తించారు. అదే నెలలోనే ఢిల్లీకి విమానంలో వెళ్లి అక్కడ ఏటీఎంలో ఈ ఏడాది జనవరిలో స్కిమ్మర్‌లను అమర్చి సేకరించిన డేటా కార్డు వివరాలతో రూ.9 లక్షల 50 వేలు డ్రా చేశారు.

అదే నెలలోనే వెస్టర్న్‌ యూనియన్‌ అవుట్‌లెట్‌లో డబ్బులను రొమానియా కరెన్సీలోకి మార్చుకున్నారు. ఆ తర్వాత గాబ్రియల్‌ సూచనల మేరకు అతని స్నేహితులైన టికూ బొగ్దాన్‌ కాస్టినెల్, పుయికా ఇగ్ను మరియన్‌లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో హైదరాబాద్‌కు వచ్చి నగరంలోని కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, విజయ్‌నగర్‌కాలనీ, జూబ్లీహిల్స్‌లోని నాలుగు ఏటీఎం సెంటర్లలో ఏటీఎం కార్డులు ఇన్‌సర్ట్‌ (కార్డును పెట్టే ప్రాంతం) చేసే దగ్గర అనుమానం రాకుండా చిప్‌తో కూడిన స్కిమ్మర్‌లను అమర్చారు. మెషీన్‌ కీ బోర్డుకుపైన రహస్య కెమెరాలను ఏర్పాటుచేశారు. ఈ స్కిమ్మర్‌ ద్వారా కార్డు పెట్టగానే ఖాతాదారుడి వివరాలను తీసుకొని చిప్‌లో భద్రపరుస్తుంది. రహస్య కెమెరా కీబోర్డు మీద నమోదయ్యే పిన్‌ నంబర్‌ల వివరాలను రికార్డు చేసుకుంటుంది.

మరుసటిరోజూ వచ్చి ఈ స్కీమర్, సీసీకెమెరాలను తీసుకెళ్లారు. వాటిలో వచ్చిన డేటా, దృశ్యాలతో మరో కార్డులోకి గాబ్రియల్‌ టెక్నికల్‌ టూల్స్‌తో క్లోనింగ్‌ చేసి యాంటీ గిఫ్ట్‌కార్డు(ఏటీఎం డూప్లికేట్‌) వెనకాల పిన్‌ నంబర్‌ రాసుకునేవాడు. ఆ తర్వాత డ్రా చేసేవాడు. ఇలా కూకట్‌పల్లికి చెందిన అనిల్‌ భార్గవ బ్యాంక్‌ ఖాతా నుంచి లక్ష రూపాయలు ముంబైలోని గోరేగావ్‌లోని ఓ బ్యాంక్‌ నుంచి డ్రా అయినట్టుగా సెల్‌కు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. వెంటనే సంబంధించి బ్యాంక్‌ కాల్‌సెంటర్‌కు కాల్‌ చేయగా మీ బ్యాంక్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారంటూ సమాధానం చెప్పడంతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్‌ డేటా సహకారంతో ముంబైలోని నాలుగు ఏటీఎం కేంద్రాల నుంచి డబ్బు విత్‌డ్రా అవుతున్నట్టు గుర్తించారు. 

మార్చుకుందామని వచ్చిదొరికిపోయారు...
అయితే అప్పటికే ఆయా ఏటీఎంల నుంచి దాదాపు రూ.35 లక్షలు డ్రా చేసిన గాబ్రియల్, అలెగ్జాండ్రులు అక్కడ డబ్బు తమ కరెన్సీలోకి మార్చడం అంత సేఫ్‌ కాదని భావించి హైదరాబాద్‌లోని కరెన్సీ మార్పిడి కేంద్రానికి చేరుకునే సమయంలో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరు సైబరాబాద్‌లోని కూకట్‌పల్లి ఐసీఐసీఐ బ్యాంక్, జగద్గిరిగుట్టలోని కెనరా బ్యాంక్‌లతో పాటు హైదరాబాద్‌లోని మరో రెండు ఏటీఎం కేంద్రాల్లో స్కిమ్మర్లు అమర్చినట్టుగా విచారణలో ఒప్పుకున్నారు. అయితే గాబ్రియల్‌ స్నేహితులైన టికూ, పుయికాలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో హైదరాబాద్‌లో ఈ పనిచేశారని చెప్పారు. ఏటీఎం కేంద్రాల్లో టికూ స్కిమ్మర్‌ అమర్చితే, పుయికా మరుసటిరోజు తొలగించేవాడని విచారణలో వెల్లడించారు.

వారి పని పూర్తవడంతో రుమేనియా వెళ్లిపోయారని పోలీసులకు తెలిపారు. ఆయా ఏటీఎం కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజీల్లో టికూ, పుయికాల ముఖాలు కనబడతాయనే ధైర్యంతో హైదరాబాద్‌కు వచ్చామని, ఇలా దొరికిపోతామని ఊహించలేదని పోలీసుల విచారణలో అన్నట్టు తెలిసింది. అయితే వీరు ఇప్పటివరకు 2040 కార్డులను క్లోనింగ్‌ చేసి 560 కార్డుల నుంచి డబ్బులు డ్రా చేశారని సజ్జనార్‌ వివరించారు. ఆలీబాబా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ నుంచి తెప్పించిన స్కిమ్మింగ్‌ కార్డులు, మాగ్నటిక్‌ రీడర్‌లు కొనుగోలు చేశాడని తెలిపారు. ఈ నిందితులను పట్టుకున్న డీసీపీ క్రైమ్స్‌ జానకి షర్మిలా, ఏసీపీ వై.శ్రీనివాస్‌కుమార్‌లను అభినందించారు.

వచ్చే వారంలో బ్యాంకర్లతో సమావేశం
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో సుమారు ఐదువేలకుపైగా ఏటీఎం కేంద్రాలున్నాయి. వీటిలో చాలావరకు సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలు ఉన్నట్టుగా పోలీసులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలోనూ భద్రత సిబ్బందిని నియమించుకోవాలని పోలీసులు గట్టిగా హెచ్చరించినా పెద్దగా పట్టించుకోలేదు. ఏటీఎంలలో సీసీటీవీ కెమెరాలున్నా పర్యవేక్షణ కొరవడింది. ఈ నేపథ్యంలో డెబిట్‌ కార్డు క్లోనింగ్‌ మోసాలు జరగడంతో వచ్చే వారంలో అన్ని బ్యాంక్‌ల మేనేజర్లతో సమావేశం నిర్వహించాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ నిర్ణయించారు. ఖాతాదారుల భద్రతే లక్ష్యంగా ఉండాలని సూచించడంతో పాటు మోసాలకు చెక్‌పెట్టేలా అవగాహన కలిగించాలని నిర్ణయించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా