మనువు కుదిరింది.. తనువు చాలించింది

22 Feb, 2020 07:37 IST|Sakshi
భారతి(ఫైల్‌)

చదువుకుంటానని చెప్పినా

పెళ్లి నిశ్చయించడంతో విద్యార్థిని ఆత్మహత్య

బసవకొత్తూరులో విషాదఛాయలు

శ్రీకాకుళం, కవిటి: చదువుకుంటానని చెప్పినా వినకుండా పెళ్లి నిశ్చయించారని మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి కవిటి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  బసవకొత్తూరుకు చెందిన బసవ రామయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె బసవ భారతి(19) డిగ్రీ సెకెండియర్‌ చదువుతోంది. భారతికి పెళ్లి చేయాలని ఇంట్లో పెద్దలు మంచి సంబంధం చూసి వివాహ నిశ్చయం చేసుకున్నారు. అయితే తాను డిగ్రీ పూర్తి చేసేవరకు పెళ్లి చేసుకోనని, వివాహ ప్రయత్నాన్ని విరమించుకోవాలని భారతి పెద్దలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. రెండో కుమార్తెకు మంచి సంబంధం రావడం.. పెద్దకుమార్తెకు పెళ్లిచేయకుండా చిన్నమ్మాయికి వివాహం చేయకూడదన్న స్థానిక కట్టుబాట్లను గౌరవించేందుకే భారతికి పెళ్లి సంబంధాన్ని మాత్రమే నిశ్చయం చేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాతే పెళ్లి చేద్దామనే ఆలోచనతో సంబంధం కుదుర్చుకున్నారు.

కానీ భారతి పెద్దల నిర్ణయాన్ని అర్ధంచేసుకోలేక క్షణికావేశంలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుంది. ఇంటికి వచ్చిన సోదరి వేలాడుతున్న అక్కను చూసి కేకలుపెట్టి ఇరుగుపొరుగువారికి సమాచారం అందించింది. వెంటనే వారు వచ్చి కొనఊపిరితో ఉన్న భారతిని సోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  మెరుగైన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే భారతి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కవిటి ఎస్‌ఐ కె.వాసునారాయణ తెలిపారు. శవపంచనామా నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహం అప్పగించారు.

మరిన్ని వార్తలు