డెహ్రడూన్‌ విద్యార్థి మృతిలో వెలగు చూసిన దారుణాలు

4 Apr, 2019 15:08 IST|Sakshi

డెహ్రడూన్‌ : బిస్కెట్‌ ప్యాకెట్‌ దొంగతనం చేశాడనే నేపంతో సీనియర్లు ఓ విద్యార్థిని కొట్టి చంపారనే వార్త డెహ్రడూన్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు సదరు విద్యార్థి మృతదేహాన్ని స్కూల్‌ ఆవరణలోనే ఖననం చేసింది. స్థానిక మీడియా ప్రోద్బలంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. విద్యార్థులను ఔటింగ్‌కు తీసుకెళ్తుండగా బాధితుడు దగ్గర్లోని కిరాణ దుకాణంలో బిస్కెట్‌ ప్యాకెట్‌ దొంగతనం చేశాడని షాపు యజమాని ఉపాధ్యాయులకు తెలిపాడు. దాంతో ఔటింగ్‌ క్యాన్సల్‌ అయ్యింది.

బాధితుడి వల్లే ఇలా జరిగిందని భావించిన సీనియర్‌ విద్యార్థులు అతన్ని ఒక క్లాస్‌ రూమ్‌లోకి తీసుకెళ్లారు. బాధితుడి కాళ్లు చేతులను ఓ పైప్‌కి కట్టి బ్యాట్‌, స్టంప్స్‌ తీసుకోని విపరీతంగా కొట్టారు. అంతేకాక సదరు విద్యార్థి బట్టలు తొలగించి చల్లని నీటిలో ముంచారు. అంతటితో ఊరుకోక కుర్‌కురే చిప్స్‌ని, బిస్కెట్లని టాయిలెట్‌ వాటర్‌లో ముంచి తినమని బలవంతం చేశారు. దెబ్బల ధాటికి తట్టుకోలేక సదరు విద్యార్థి చేసిన ఆక్రందనలు పాఠశాలలో ఉన్న 200 మంది విద్యార్థులు కానీ.. ఉపాధ్యాయులు కానీ వినిపించలేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సదరు విద్యార్థి ఒంటరిగా అదే గదిలో పడి ఉన్నాడు. సాయంకాలం వార్డెన్‌ ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఈ విషయం బయటకు పొక్కితే ప్రమాదం అని భావించిన పాఠశాల యాజమాన్యం సదరు బాలుడి మృతదేహాన్ని పాఠశాలలోనే ఖననం చేసింది. ఆ తర్వాత మృతుడి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఫుడ్‌ పాయిజన్‌ వల్ల మీ అబ్బాయి చనిపోయాడని తెలిపారు. కానీ స్థానిక మీడియా విద్యార్థి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేయడం.. యాజమాన్యం కూడా బయటి వారిని లోపలికి అనుమతించకపోవడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో వారు పాఠశాలకు వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో పోలీసులు చనిపోయిన విద్యార్థి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌ మార్టం నిర్వహించారు. ఆ రిపోర్ట్‌ ప్రకారం  కేసు నమోదు చేసి ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులతో పాటు ముగ్గురు పాఠశాల సిబ్బందిని, వార్డెన్‌ని కూడా అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు