తన హత్యకు తానే కాంట్రాక్ట్‌

15 Jun, 2020 19:08 IST|Sakshi
పోలీసుల అదుపులో వ్యాపారవేత్తను హత్య చేసిన నిందితులు

న్యూఢిల్లీ: అప్పులు పాలైన ఓ వ్యాపారవేత్త తాను చనిపోతే.. కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్‌ డబ్బులు వస్తాయి.. వారి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో తన హత్యకు తానే సుపారి ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారవేత్తను హత్య చేసిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఒక మైనర్‌ కూడా ఉన్నాడు. వివరాలు.. చనిపోయిన వ్యాపారవేత్త ఆనంద్‌ విహారి ఈ నెల 9 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో జూన్ 10న రన్హోలా పోలీస్‌ స్టేషన్‌కు ఒక పీసీఆర్ కాల్ వచ్చింది. బాప్రోలా విహార్‌లోని ఖేడి వాలా పుల్ సమీపంలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఉన్నాడని కాల్‌ చేసిన వ్యక్తి పోలీసులకు తెలిపాడు.

ఫోన్‌ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ 35 సంవత్సరాల వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని పరిశీలించిన తరువాత, ఆ వ్యక్తి చేతులు కట్టివేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేయగా మృతుడిని తప్పిపోయిన వ్యాపారవేత్త ఆనంద్‌ విహారిగా గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతుడి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. ఆనంద్‌ విహారి తప్పిపోయినట్లుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈలోపు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా పోలీసులు ఒక నిందితుడిని పట్టుకున్నారు. అతడిని విచారించగా  నేరంలో తన పాత్రను అంగీకరించాడు.

అంతేకాక తనతో పాటు మరో ఇద్దరికి కూడా ఈ నేరంలో పాత్ర ఉన్నట్లు సదరు నిందితుడు తెలిపాడు. ఓ మైనర్‌ కుర్రాడు చెప్పడంతో సదరు వ్యాపారవేత్తను హత్య చేసినట్లు అతడు వెల్లడించాడు. ఈ క్రమంలో మైనర్‌ కుర్రాడిని పట్టుకుని ఆరా తీయగా అతడు ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడించాడు. సదరు వ్యాపారవేత్త అప్పుల పాలయ్యాడని.. తాను చనిపోతే ఇన్సూరెన్స్‌ డబ్బులు వస్తాయని.. దాంతో కుటుంబ సభ్యులైన బాగుంటారని భావించాడు. ఈ క్రమంలో తనను చంపాల్సిందిగా మైనర్‌ కుర్రాడికి కాంట్రాక్ట్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో మరో ఇద్దరితో కలిసి అతడు వ్యాపారవేత్తను హత్య చేశాడు.

మరిన్ని వార్తలు