హనీ..మీరు అక్కడికెందుకు వెళ్లలేదు?

26 Sep, 2017 19:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ ‌: డేరా బాబా గుర్మీత్‌ సింగ్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌సింగ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు రిజర్వులో ఉంచింది. రేప్‌ కేసులో గుర్మీత్‌ సింగ్‌కు జైలు శిక్ష పడిన తర్వాత హనీప్రీత్‌ కనిపించకుండాపోయిన సంగతి తెలిసిందే. ఆమె కోసం రెండు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న నేపథ్యంలో సోమవారం ముందస్తు బెయిల్‌కు హనీ దరఖాస్తు చేసుకుంది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం.. పంజాబ్‌-హర్యానా హైకోర్టుకు వెళ్లకుండా తమ వద్దకు ఎందుకు వచ్చారని ఆమెను ప్రశ్నించింది. అజ్ఞాతంలో ఉన్న హనీతోపాటు డేరా బాబా సహచరులైన ఆదిత్య ఇన్‌సాన్‌, పవన్‌ ఇన్‌సాన్‌ను అరెస్టు చేయాలని పంచకుల కోర్టు సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యంలో.. ఎవరికీ అనుమానం రాకుండా బురఖా ధరించి ఆమె ఢిల్లీలోని తన న్యాయవాది ఇంటికి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఆమె న్యాయవాది ఇంటికి వెళుతుండగా నమోదైన సీసీటీవీ కెమెరా దృశ్యాలు పోలీసులకు అందాయి. ఈ వీడియో దృశ్యాల్లో ఉన్నది హనీయేనని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన న్యాయవాది ప్రదీప్‌ ఆర్య  ద్వారా ఆమె ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఢిల్లీలో పోలీసుల గాలింపులు
డేరా బాబా గుర్మీత్‌ సన్నిహితురాలు హనీప్రీత్‌ సింగ్‌, ఇతర సహచరుల కోసం హర్యానా పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం గాలించారు. ఆమె కోసం ఢిల్లీ, నేషనల్‌ కాపిటల్‌ రీజియన్‌ పరిసర ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్‌-2లోనూ సోదాలు జరిగాయి. డేరా బాబా అకృత్యాలు, ఆయన అరెస్టు అనంతరం జరిగిన అల్లర్లులో హనీతోపాటు ఆదిత్య ఇన్‌సాన్‌, పవన్‌ ఇన్‌సాన్‌  ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. వీరి గురించి అంతర్జాతీయంగా అలర్ట్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు