విషాదం: కొడుకు ఎదుటే తండ్రి కాల్చివేత

14 Jun, 2018 17:48 IST|Sakshi
ఘటన జరిగిన ప్రాంతం​

సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో పట్టపగలే దోపిడీ చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలోకి చొరబడిన దుండగులు ఆభరణాలను దోచుకోవడంతో పాటు అక్కడే ఉన్న షాప్‌ యజమాని హేమంత్‌ కౌశల్‌ను కాల్చి చంపారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని ఆదర్శనగర్‌లో మంగళవారం జరిగింది. అయితే, ఈ ఘటనలో దొంగతనానికి, తండ్రి చావుకు కొడుకు ప్రత్యక్ష సాక్షిగా నిలవడం విషాదకరం. 

కౌశల్ కొడుకు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముగ్గురు దుండగులు హెల్మెట్‌ ధరించి షాప్‌లోకి చొరబడ్డారు. హెల్మెట్‌ తీయాలని దుకాణంలో పనిచేసే అశోక్‌ కుమార్‌ వారిని కోరగా.. తుపాకితో దుండగులు అతన్ని బెదిరించారు. మీ యజమానిని పిలవమని ఆదేశించారు. అశోక్‌ పిలుపుతో అక్కడే మరో గదిలో ఉన్న నాన్న అక్కడికి వచ్చారు. షాప్‌లో ఉన్న బంగారమంతా ఇవ్వాలనీ, లేదంటే నీ కొడుకును చంపేస్తామని దుండగులు నాన్నను బెదిరించార’ని ఎనిమిదో తరగతి చదువుతున్న కౌశల్‌ కొడుకు చెప్పుకొచ్చాడు.

‘వాళ్ల బెదిరింపులకు భయపడిన నాన్న.. బంగారం తీసుకుపొండి, నా కొడుకును మాత్రం ఏం చేయొద్దని వేడుకున్నాడు. దొంగలు ఉన్నదంతా దోచుకుని పరారవుతున్న క్రమంలో నాన్న వాళ్ల కాళ్లపై పడి.. నా కొడుకు‍ భవిష్యత్‌ కోసం కొంచెం బంగారం మిగిల్చి వెళ్లాలని వేడుకున్నాడు. దాంతో ఒకడు నాన్నను సోఫాలో పడేసి కాలితో తన్నాడు. మరొకడు తుపాకితో నాన్నపై పలుమార్లు కాల్పులు జరిపాడ’ని తండ్రిని గుర్తు చేసుకుని కౌశల్‌ కొడుకు భోరున విలపించాడు.

మరోవైపు ఘటన జరిగి రెండు రోజులు కావొస్తున్నా దోపిడీ ముఠాకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి సమాచారం లభించలేదు. కాగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామనీ,  సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల్ని పట్టుకుటామని పోలీసు కమిషనర్‌ అస్లాం ఖాన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు