కోటి రూపాయలు ఇస్తే పది కోట్లు ఇస్తా

9 May, 2018 14:19 IST|Sakshi

న్యూఢిల్లీ : రూపాయి ఇచ్చి పదిరూపాయలు రావాలనుకోవడం దురాశ. ఇలాంటి ఆలోచన చేసే ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త దాదాపు కోటిన్నర రూపాయలు మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన వ్యాపారి నరేందర్‌కు కొన్ని సంవత్సరాల క్రితం వీరేంద్ర బ్రార్‌, అతని కొడుకు బాబా బ్రార్‌తో పరిచయం ఏర్పడింది. వీరేంద్ర తమ దగ్గర రైస్‌ పుల్లర్‌ ఉందని, దాన్ని త్వరలోనే నాసా పరీక్షించనుందని, పరీక్ష విజయవంతమైతే నాసా తమ దగ్గర ఉన్న రైస్‌ పుల్లర్‌ని 37,500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనుందని నమ్మబలికాడు. ఈ రైస్‌పుల్లర్‌ని నాసా అంతరిక్ష పరిశోధనల కోసం ఉపయోగిస్తుందని తెలిపాడు.

రైస్‌ పుల్లర్‌ను పరీక్షించడం కోసం శాస్త్రవేత్తలను తీసుకురావాల్సి ఉంటుందని, శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించే సమయంలో ధరించే సూట్‌తో పాటు రైస్‌ పుల్లర్‌ను పరీక్షించడం కోసం అవసరమైన రసాయనాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపాడు. పరీక్ష విజయవంతమైతే తక్షణమే తనకు వచ్చే 37 వేల కోట్ల రూపాయాల్లో 10 కోట్ల రూపాయలను నరేంద్రకు ఇస్తానని నమ్మబలికాడు. ఒకేసారి అంత పెద్ద​ మొత్త వస్తుందని ఆశపడ్డ నరేంద్ర, వీరేంద్రతో ఒక ఎమ్‌ఓయూను కూడా కుదుర్చుకున్నాడు. అనంతరం వీరేంద్రకు 87.2లక్షల రూపాయలను ఇచ్చాడు. డబ్బు చేతికి వచ్చిన వెంటనే వీరేంద్ర హపూర్‌ ప్రాంతంలో రైస్‌ పుల్లర్‌ను పరీక్షిస్తానని తెలిపాడు. కానీ ఎటువంటి పరీక్షలు నిర్వహించలేదు. కారణమేంటని అడిగితే ఆ ప్రాంతం అంత సురక్షితం కాదని తెలిపాడు. ఆ రోజు నుంచి ఏదో ఒక సాకు చెప్తూ దాటవేస్తున్నాడు.

అదే సమయంలో వీరేంద్ర మాటలు నమ్మి అతనికి డబ్బులు ఇచ్చిన ఇతరులు కూడా తమ డబ్బును తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. వారికి డబ్బులు ఇవ్వడం కోసం వీరేంద్ర, మరోసారి నరేంద్రను ఆశ్రయించాడు. ఇసారి తప్పకుండా రైస్‌పుల్లర్‌ను పరీక్షిస్తామని, అందుకోసం హిమాచల్‌లోని ధర్మశాలలో ఓ ప్రాంతాన్ని ఎన్నుకున్నామని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో డీల్‌ ఫైనల్‌ అవుతుందని తెలిపాడు. వీరేంద్ర మాటలు నమ్మిన నరేంద్ర మరోసారి మోసపోయాడు. ఈ సారి మరో 51.1లక్షల రూపాయలను వీరేంద్రకు ఇచ్చాడు.

వీరేంద్ర 20 వేల రూపాయలు ఇచ్చి ఇద్దరు నకిలీ శాస్త్రవేత్తలను తీసుకువచ్చాడు. వారు పరీక్షిస్తున్నట్లు నటించి వెళ్లిపోయారు. అనుమానం వచ్చిన నరేంద్ర శాస్త్రవేత్తలుగా వచ్చిన వారిని పట్టుకుని నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న నరేంద్ర పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రికొడుకులను అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్‌ బ్రాంచ్‌ జాయింట్‌ కమీషనర్‌ అలోక్‌ కుమార్‌​ మాట్లాడుతూ.. ‘రైస్‌ పుల్లర్‌ అనే ఎటువంటి వస్తువు లేదు. కానీ మోసగాళ్లు రాగి పళ్లాన్ని తీసుకుని దానికి అయస్కాంత పూత పూసి జనాలను మోసగిస్తున్నారు. కనుక ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాల’ని తెలిపారు.

మరిన్ని వార్తలు