వన్‌ప్లస్‌ 6 ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే....

29 Jun, 2018 12:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తల్లిని సర్‌ప్రైజ్‌ చేయడం కోసం  ఓ టాప్‌ ఈ కామర్స్‌ సైట్‌లో వన్‌ప్లస్‌ 6 ఫోన్‌ను ఆర్డర్‌ చేసిన యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ఫోన్‌కు బదులుగా మార్బుల్స్‌ రావడంతో కంగుతిన్న బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు... దక్షిణ ఢిల్లీకి చెందిన మానస్‌ సక్సేనా అనే యువకుడు ఈ కామర్స్‌ సైట్‌లో వన్‌ప్లస్‌ 6 ఫోన్‌ను ఆర్డర్‌ చేశాడు. అందుకోసం 34,999 రూపాయలు డెబిట్‌ కార్డు ద్వారా చెల్లించాడు. మరుసటి రోజు సాయంత్రానికల్లా ఫోన్‌ డెలివరీ చేయాలని రిక్వెస్ట్‌ చేశాడు. అయితే అడిగిన సమయాని కంటే ముందుగానే డెలివరీ బాయ్‌ రావడంతో సంతోష పడిన మానస్‌ ప్యాకింగ్‌ చేసి ఉన్న బాక్స్‌ను తీసుకున్నాడు.

కొడుకు ఇచ్చిన గిఫ్ట్‌ను చూసేందుకు సాయంత్రం అతడి తల్లి బాక్స్‌ను తెరచి చూడగా అందులో ఫోన్‌కు బదులు మార్బుల్స్‌తో పాటు చిన్న చిన్న రాళ్లు ఉన్నాయి. దీంతో ఆమె సంబంధిత కామర్స్‌ సైట్‌కు ఫోన్‌ చేసి చేయగా... బాక్స్‌లో ఉన్న మార్బుల్స్‌ ఫొటోతో సహా, ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు ఫైల్‌ చేయమని చెప్పడంతో ఆమె అలాగే చేసింది. అయితే ఫిర్యాదు స్వీకరించిన అనంతరం తాము ఆ బాక్స్‌లో ఫోన్‌ను ఉంచి ప్యాక్‌ చేశామని, సీల్‌ తీయలేదు అంటున్నారు గనుక డెలివరీ బాయ్‌ తప్పు కూడా లేదంటూ బాధ్యతా రహితంగా మాట్లాడటంతో ఆమె వసంత్‌ కుంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్‌​ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు