కరోనా నుంచి కోలుకున్న డాక్టర్‌కు బెదిరింపులు

16 May, 2020 15:04 IST|Sakshi

న్యూఢిల్లీ: కనిపించని శత్రువు కరోనాతో పోలీసులు, వైద్యులు యుద్ధం చేస్తున్నారంటూ ప్రధాని సైతం వారి సేవలను ప్రశంసిస్తుంటే.. కొందరు ముర్ఖులు మాత్రం వారిని అవమానిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వైద్యురాలు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్య సేవలందించారు. దాంతో ఆమెకు కూడా వ్యాధి సోకింది. వెంటనే గుర్తించి, చికిత్స తీసుకోవడంతో కరోనా నుంచి కోలుకున్నారు. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి.. హోమ్‌ క్వారంటైన్‌ కోసం ఇంటికి వచ్చారు. (వైరల్‌ వీడియా షేర్‌ చేసిన ప్రధాని మోదీ)

అయితే విషయం తెలిసిన ఇరుగుపొరుగు వారు డాక్టర్‌ను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్లాట్‌ ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించారు. ఈ క్రమమంలో బాధిత వైద్యురాలు మాట్లాడుతూ.. ‘నిన్న సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో మనిష్‌ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి అసభ్యకరమైన మాటలతో  నన్ను అవమానించాడు. ప్లాట్‌ ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించాడు. అంతేకాక ‘నువ్వు బయటకు ఎలా వెళ్తావో నేను చూస్తాను. నువ్వు ఈ స్థలాన్ని వదిలి వెళ్లాల్సిందే. ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో’ అంటూ బెదిరించాడు. నాకు కరోనా లేదు.. నెగిటీవ్‌ వచ్చిందని చెప్పినా అతడు పట్టించుకోలేదు’ అని వాపోయారు. వైద్యురాలి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సదరు వ్యక్తి మీద కేసు నమోదు చేశారు.(వైద్యురాలికి ఘన స్వాగతం.. భావోద్వేగం)

వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్ కు ఏప్రిల్ 22న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా, కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులపై, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, అనుమానితులను క్వారంటైన్ చేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై హింసకు, వేధింపులకు పాల్పడితే అది శిక్షార్హమైన, బెయిల్‌కు వీలు లేని నేరంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు