రాజధానిలో విజృంభిస్తోన్న సైబర్‌ నేరగాళ్లు

14 May, 2019 09:35 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సైబర్‌ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో మూడు ఏటీఏంలలో కలిపి సుమారు 89 మంది అకౌంట్ల నుంచి దాదాపు రూ. 19 లక్షల వరకు విత్‌ డ్రా చేశారు. ఈ సంఘటనలన్ని తిలక్‌ నగర్‌ ఏరియా పరిధిలోనే జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ఈ నెల ఒకటవ తేదీన తిలక్‌ నగర్‌ ఏరియాలో మొదటి ఫిర్యాదు నమోదయ్యింది. తన ఏటీఎం నుంచి తనకు తెలియకుండానే డబ్బు విత్‌డ్రా అయినట్లు ఓ వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేశాడు. రెండు మూడు రోజుల్లోనే బాధితుల సంఖ్య పెరగడంతో ఈ కేస్‌ను సీరియస్‌గా తీసుకున్నాం’ అన్నారు.

ఆ అధికారి మాట్లాడుతూ.. ‘ఒకే ఏటిఎం నుంచి సొమ్ము విత్‌డ్రా అవుతున్నట్లు గుర్తించిడంతో.. దీని వెనక ఓ గ్యాంగ్‌ ఉన్నట్లు భావించాం. ఓ వైపు ఈ కేసుల గురించి దర్యాప్తు కొనసాగుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఈ సారి మరో రెండు ఏటీఎంల నుంచి కూడా సొమ్ము డ్రా చేసినట్లు మా దృష్టికి వచ్చింది. మొత్తం వారం రోజుల వ్యవధిలో 89 మంది అకౌంట్ల నుంచి దాదాపు రూ. 19 లక్షల సొమ్ము డ్రా చేసినట్లు గుర్తించా’మని సదరు అధికారి తెలపారు. అంతేకాక నిందితులు ఏటీఎంలలో స్కిమ్మింగ్‌ మెషన్‌లను అమర్చడం ద్వారా ఈ నేరాలకు పాల్పడుతుండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

రోమానియాకు చెందిన కార్డ్‌ క్లోనింగ్‌ గ్యాంగ్‌ ఈ నేరాలకు పాల్పడుతుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ సైబర్‌ బృందం ఈ కేసును చేధించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓ బాధితుడు మాట్లాడుతూ.. ‘నేను ఎలాంటి ఆన్‌లైన్‌ ట్రాన్సక్షన్లు చేయ్యను. నాకు నా అకౌంట్‌ నుంచి దాదాపు 50 వేల రూపాయలు విత్‌డ్రా చేశారు. ఇందుకు సంబంధించి నాకు ఎలాంటి ఫోన్‌ కానీ.. మెసేజ్‌ కానీ రాలేద’ని తెలిపారు.
 

మరిన్ని వార్తలు