శశిథరూర్‌పై చార్జిషీట్‌

15 May, 2018 02:48 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌పై చార్జిషీట్‌ నమోదైంది. తన భార్య సునంద పుష్కర్‌ ఆత్మహత్యకు థరూర్‌ ప్రేరేపించారని అందులో ఆరోపించారు. ఈ మేరకు 3 వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను సోమవారం ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో శశిథరూర్‌ను అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరముందని చార్జ్‌షీట్‌లో కోర్టుకు తెలిపారు. కేసులో థరూర్‌ను ఏకైక నిందితుడిగా పేర్కొంటూ.. అతనిపై చట్టపరంగా ముందుకెళ్లేందుకు తగిన ఆధారాలున్నాయన్నారు.

తిరువనంతపురం ఎంపీగా కొనసాగుతున్న శశి థరూర్‌కు సమన్లు జారీచేయాలని కోర్టును పోలీసులు కోరారు. ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ధర్మేంద్ర సింగ్‌ ముందు దాఖలు చేసిన ఈ చార్జిషీట్‌పై మే 24న విచారణ జరగనుంది. జనవరి 17, 2014న ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌ గదిలో సునంద శవమై కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐపీసీ 498 ఏ(గృహ హింస), 306(ఆత్మహత్యకు పురికొల్పడం)సెక్షన్ల కింద శశిథరూర్‌పై కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీసుల చార్జిషీట్‌ అర్థరహితమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని శశిథరూర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు