రోహింగ్యా శిబిరానికి నేనే నిప్పు పెట్టా!

21 Apr, 2018 13:29 IST|Sakshi
మనీష్‌ చండేలా (కుడి వైపు చివర ఉన్న వ్యక్తి).. ఇన్‌సెట్‌లో ఘటనా స్థలంలో దృశ్యాలు

సాక్షి, న్యూఢిల్లీ : రోహింగ్యా శిబిరం అగ్ని ప్రమాద ఘటనలో దిగ్భ్రాంతికి గురి చేసే విషయం వెలుగు చూశాయి. అది ప్రమాదం కాదని.. శిబిరానికి తానే నిప్పు పెట్టానంటూ బీజేపీ యువ విభాగం నేత మనీష్‌ చండేలా ప్రకటించటం కలకలం రేపింది. దీంతో సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌.. మనీష్‌పై ఫిర్యాదు చేశారు. 

అసలేం జరిగింది... నైరుతి ఢిల్లీలోని సరితా విహార్‌ ప్రాంతంలో ఉన్న ఓ శిబిరంలో 50 రోహింగ్యా కుటుంబాలు(సుమారు 240 మంది) ఆశ్రయం పొందుతున్నాయి.  ఇది రాజధానిలోని ఏకైక రోహింగ్యా శిబిరం. ఏప్రిల్‌ 15 ఆదివారం తెల్లవారుజామున ఈ శిబిరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. బట్టలు, పత్రాలు మరియు ఇతర వస్తువులు అన్ని కాలిపోయాయి. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు దీనిని అగ్ని ప్రమాదంగానే భావించారు. 

చండేలా ట్వీట్లు...  ఈ ఘటనపై స్పందిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేత మనీష్‌ చండేలా తన ట్వీటర్‌లో చేసిన ట్వీట్‌ దుమారం రేపింది. ‘అవును.. ఆ పని చేసింది మేమే. ఇంకా చేస్తాం. రోహింగ్యాలు భారత్‌ వదిలి వెళ్లాల్సిందే’ అంటూ చండేలా ట్వీట్‌ చేశాడు. ఆపై ‘శభాష్‌.. మా హీరోలు మంచి పని చేశారు, ‘అవును.. రోహింగ్యా ఉగ్రవాదుల ఇళ్లను తగలబెట్టింది మేమే’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు. క్షణాల్లో ఇవి వైరల్‌ కావటంతో  ఏఐఎంఎంఎంతోపాటు పలు సంఘాల నుంచి బెదిరింపులు, విమర్శలు వచ్చాయి. దీంతో వెంటనే చండేలా ఆ ట్వీట్లను తొలగించాడు.

అయితే అప్పటికే ఆ ట్వీట్ల స్క్రీన్‌ షాట్లు వైరల్‌ అయ్యాయి. వీటి ఆధారంగా న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ క్రిమినల్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. ‘మనీశ్‌ చండేలా అతని అనుచరులు రోహింగ్యా శిబిరాన్ని తగలబెట్టారు. పైగా ఆ విషయాన్ని గర్వంగా ట్వీటర్‌లో ప్రకటించాడు. ఢిల్లీ పోలీసులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీజేపీ కూడా తమ సభ్యుడి నిర్వాకంపై స్పందించలేదు’ అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు