డబ్బులివ్వకపోతే లేపేస్తామని బెదిరింపు

12 Jun, 2019 09:05 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ సుమిత్‌ గరుడ్‌

నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

మరో ఇద్దరి కోసం గాలింపు

సాక్షి, సాలూరు (విజయనగరం): తాము మావోయిస్టులమని అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నీతోపాటు నీ కుటుంబాన్ని కూడా లేపేస్తామని బెదిరించిన వ్యవహారంలో నలుగురు వ్యక్తులను వలపన్ని పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్టు పార్వతీపురం ఏఎస్పీ సుమిత్‌ గరుడ్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం సాలూరు సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇన్‌చార్జి సీఐ రాంబాబుతో కలిసి ఏఎస్పీ మాట్లాడారు. సాలూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆర్నిపల్లి ధనుంజయ్‌నాయుడు సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో నివాసముంటూ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

అతని వద్ద లారీ క్లీనర్‌గా పని చేస్తున్న మక్కువ మండలం శంబరకు చెందిన భానుప్రకాష్, బంగారమ్మ కాలనీకి చెందిన విద్యాసారధి, మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన కలిపిండి ఏడుకొండలు కలిసి డబ్బున్న వ్యక్తులను గుర్తించి, వారిని మావోయిస్ట్‌లమని ఫోన్‌లో బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. సోమవారం మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన మినీ కాంట్రాక్టర్‌ అక్యాన రామినాయుడుకు ఫోన్‌ చేసి మావోయిస్ట్‌లమంటూ, తాము అడిగిన 3లక్షల రూపాయలు చెప్పిన చోటుకు తీసుకురావాలని, లేకపోతే నీతోపాటు నీ కుటుంబాన్ని లేపేస్తామని బెదించినట్టు తెలిపారు.

మీ గ్రామానికి చెందిన ఇద్దరి నుంచి ఇలాగే డబ్బులు వసూలు చేసామని, ఇవ్వకపోతే పర్యావసానాలు ఎలా వుంటాయో వారిని అడిగి తెలుసుకోమని హెచ్చరించడంతో సదరు కాంట్రాక్టర్‌ తన స్నేహితుడికి ఉప్పందించాడన్నారు. దీంతో ఆయన మక్కువ ఎస్‌ఐ షేక్‌ శంకర్‌కు సమాచారం అందివ్వడంతో వలపన్ని పాచిపెంట మండలంలోని పారమ్మకొండ సమీపంలో నలుగురు వ్యక్తులను పట్టుకున్నామన్నారు. వారి నుంచి లక్షా 35వేల రూపాయల నగదు, నాలుగు సెల్‌ఫోన్లతో పాటు హోండా ఏక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరచుకున్నామన్నారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన మరో ఇద్దరిని అరెస్ట్‌ చేయాల్సి వుందన్నారు.

గతంలో అక్రమ వసూళ్లు 
ఇదిలా వుండగా గతంలో మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన ఎల్‌ఐసీ ఏజెంట్‌ బోగి గౌరినా«ధ్‌ నుంచి వీరు 2లక్షల రూపాయలు, పార్టీ మారావంటూ మాజీ సర్పంచ్‌ బొంగు చిట్టినాయుడు నుంచి 3లక్షల రూపాయలను వసూలు చేసినట్టు ఏఎస్పీ వివరించారు. ఎవరైనా బెదిరింపులకు దిగితే తక్షణమే పోలీసులకు సమాచారం అందివ్వాలని ఆయన కోరారు.

ఎస్‌ఐకు అభినందనలు 
ఎస్‌ఐగా కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటికీ మక్కువ ఎస్‌ఐ షేక్‌శంకర్‌ చాకచక్యంగా వ్యవహరించారని ఏఎస్పీ ఆయనను అభినందించారు. సమాచారం బాధితుడి నుంచి అందకపోయినా వేరే వ్యక్తి ద్వారా విషయం తెలిసినా, చురుగ్గా వ్యవహరించి, నిందితులను పట్టుకున్నారన్నారు. సమావేశంలో పట్టణ ఎస్‌ఐ ఎస్‌ శ్రీనివాస్, సాలూరు రూరల్‌ ఎస్‌ఐ నరసింహమూర్తి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు