పట్టా మార్పిడికి రూ.13 లక్షలు డిమాండ్‌

25 Feb, 2020 02:44 IST|Sakshi
జయలక్ష్మి

రూ.10 లక్షలకు కుదిరిన బేరం 

ముందస్తుగా రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డీటీ  

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఓ డిప్యూటీ తహసీల్దార్‌ రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజి పేట మండలం మారేపల్లికి చెందిన వెంకటయ్య అదే గ్రామంలో మూడెకరాల 15 గుంటలను 2016లో కొనుగోలు చేశాడు. ఈ భూమిని తన పేరున పట్టా మార్పిడి కోసం తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన మల్లేశ్‌.. ఈ భూమిని 2006లో తనకు అమ్మారని వెంకటయ్య పేరు మీద పట్టా చేయొద్దంటూ అదే కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీనిపై నాగర్‌కర్నూల్‌ ఆర్డీఓ కార్యాలయంలో వివాదం నడు స్తోంది. దీనిపై జేసీకి ఫిర్యాదు చేసేందుకు వెంకటయ్య కలెక్టరేట్‌కు వచ్చాడు.

ఈ క్రమంలో ఇటీవల సి–సెక్షన్‌లో ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్న డిప్యూటీ తహసీల్దార్‌ జయలక్ష్మి అతనికి తారసపడ్డారు. వెంకటయ్యకు అనుకూలంగా పట్టా వచ్చేలా చూస్తానని అందుకు రూ.13 లక్షల లంచం ఇవ్వాలని జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. అంత డబ్బు తన వద్ద లేదని చెప్పగా చివరికి రూ.10 లక్షలు విడతల వారీగా ఇవ్వాలని సూచించారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించగా సోమవారం వల పన్ని వెంకటయ్యతో నగదును తీసుకుంటున్న జయలక్ష్మిని పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నట్టు డీఎస్పీ కృష్ణాగౌడ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు