డిప్యూటీ కలెక్టర్‌ మాధురి అరెస్ట్‌

4 Jun, 2020 04:40 IST|Sakshi

అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌లో అక్రమాలు, తప్పుడు రికార్డులు సృష్టించిన ఫలితం

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సీఆర్‌డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్‌ కనికెళ్ల మాధురిని పోలీసులు బుధవారం విజయవాడలోని ఆమె ఇంటివద్ద అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి జూనియర్‌ అడిషనల్‌ సివిల్‌ జడ్జి వీవీఎస్‌ఎన్‌ లక్ష్మి ఎదుట హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో మాధురిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రావెల గోపాలకృష్ణతో కుమ్మక్కై 3,880 చదరపు గజాలు కలిగిన పది ప్లాట్లను కేటాయించడంతో పాటు రూ.5.26 లక్షల కౌలు చెల్లించారు. చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించారని దర్యాప్తు అధికారులు గుర్తించి మాధురిపై కేసు నమోదు చేశారు.  

అసలేం జరిగిందంటే.. 
రాజధాని అమరావతి నిర్మాణం పేరిట టీడీపీ హయాంలో ల్యాండ్‌ పూలింగ్‌ కింద వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించింది. ఇందులో భాగంగా తుళ్లూరు మండలం నెక్కల్లులో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ ముఖ్య అనుచరుడైన రావెల గోపాలకృష్ణ ల్యాండ్‌ పూలింగ్‌కు 3.11 ఎకరాలు ఇచ్చినట్టుగా చూపించారు. అందుకుగాను 3,110 చదరపు గజాలు కలిగిన 8 నివాస ప్లాట్లు, 770 చదరపు గజాలు కలిగిన రెండు వాణిజ్య ప్లాట్లను సీఆర్‌డీఏ ద్వారా కేటాయించారు. వాస్తవానికి ఆ భూమి నాగార్జున సాగర్‌ కాలువ, రెండు రోడ్లకు చెందినది. తప్పులను సరిదిద్దుకునే క్రమంలో మాధురి మరిన్ని తప్పులకు ఒడిగట్టి అడ్డంగా దొరికిపోయారు.

మరిన్ని వార్తలు