పది లక్షలిస్తేనే పదోన్నతి

28 Nov, 2019 04:27 IST|Sakshi
లంచం తీసుకుంటూ సీసీ కెమెరాకు చిక్కిన అధికారి

వైద్యుడి వద్ద లంచం డిమాండ్‌ చేసిన ఆరోగ్య శాఖ డిప్యూటీ సెక్రటరీ 

అడ్వాన్స్‌గా రూ.50 వేలు తీసుకుంటూ సీసీ కెమెరాకు చిక్కిన యిర్మియా రాజు 

సీఎంవో ఆదేశాలు లెక్క చేయకుండా బేరాలు

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ఆరోగ్య శాఖలో డిప్యూటీ సెక్రటరీ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. ‘రూ.10 లక్షలిస్తే పదోన్నతి వచ్చేలా చేస్తా.. కోరిన చోటుకు పోస్టింగ్‌ ఇస్తా’ అంటూ నేరుగా ఒక వైద్యుడి క్లినిక్‌కు వెళ్లి డబ్బు డిమాండ్‌ చేసిన వైనం సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా బయటకొచ్చింది. గుంటూరు మెడికల్‌ కాలేజీలో పనిచేస్తున్న డా.వై.కిరణ్‌కుమార్‌ తనకు న్యాయంగా రావాల్సిన పదోన్నతి దక్కలేదంటూ నాలుగున్నరేళ్ల పాటు అప్పటి ప్రభుత్వంతో పోరాడారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా పదోన్నతి ఇవ్వాల్సిందేనని కమిషన్‌ తీర్పుచెప్పింది. అధికారులు మాత్రం పదోన్నతి ఇవ్వకుండా తిప్పుకున్నారు. దీంతో ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించగా.. కిరణ్‌కుమార్‌ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎంఓ ఆదేశించింది. అయితే కిరణ్‌కుమార్‌ బావమరిది ఆనంద్‌... సచివాలయంలో ఆరోగ్యశాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసే యిర్మియా రాజును సంప్రదించి తన బావ పదోన్నతి అంశాన్ని చర్చించారు. తనకు రూ.10 లక్షలు ఇస్తే నోషనల్‌ ప్రమోషన్, మళ్లీ పోస్టింగ్‌ ఇస్తానని యిర్మియా డిమాండ్‌ చేశారు. 

ఫైలు చదివాక మిగతా విషయాలు మాట్లాడుతా
నవంబర్‌ 4న గుంటూరులో కిరణ్‌కుమార్‌ నిర్వహిస్తున్న క్లినిక్‌కు వెళ్లిన యిర్మియా.. దాదాపు 30 నిముషాలు మాట్లాడి రూ.10 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు. నవంబర్‌ 20న మళ్లీ క్లినిక్‌కు వెళ్లి రూ.50వేలు తీసుకున్నారు. ‘మీకు మూడేళ్ల నుంచి వేతనం రాలేదు కదా అది కూడా వచ్చేలా చేస్తా..మీ ఫైలు చాలా క్లిష్టంగా ఉంది. బాగా చదవాలి. అన్నీ చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా’ అని చెప్పారు. ఫైలు పరిశీలించాక నాలుగైదు రోజుల్లో కలుస్తానని, అప్పుడు మిగతా మొత్తం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అతను క్లినిక్‌కు వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో అడ్డంగా దొరికిపోయారు.
వైద్యుడి నుంచి డబ్బు తీసుకుంటున్న దృశ్యాలు.. ఎడమవైపు డిప్యూటీ సెక్రటరీ యిర్మియారాజు, కుడివైపున వైద్యుడి బావమరిది ఆనంద్‌ 

సీఎంవో కార్యాలయ ఆదేశాలు బేఖాతరు తనకు న్యాయం జరగడం లేదని కిరణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఆ వినతిని పరిశీలించిన సీఎం కార్యాలయం 2019 నవంబర్‌ 5న వైద్య ఆరోగ్యశాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విజిలెన్స్‌ విభాగం ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని, 2015లో జాతీయ ఎస్సీ కమిషన్‌ ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేసి న్యాయం చేయాలని సూచించింది. అయితే ఇవేమీ ఖాతరు చేయకుండా డిప్యూటీ సెక్రటరీ యిర్మియారాజు డబ్బులు వసూలు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారు
గత నాలుగున్నర సంవత్సరాలుగా నోషనల్‌ ప్రమోషన్‌పై పోరాడుతున్నాను. అప్పటి ప్రభుత్వం న్యాయం చేయకపోగా విజిలెన్స్, ఎస్సీ కమిషన్‌ ఇచ్చిన ఆదేశాల్ని కూడా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో నా బావమరిది ఆనంద్‌...డిప్యూటీ సెక్రటరీ యిర్మియా రాజును సంప్రదించారు. అనంతరం ఆయన నా దగ్గరకొచ్చి రూ.10 లక్షలు డిమాండు చేశారు. అడ్వాన్సుగా రూ.50వేలు ఇచ్చాను. మరో రెండు లక్షలు ఇవ్వాలని, మిగతా సొమ్ము పనయ్యాక ఇవ్వాలని అడిగారు. అలాగే ఇస్తానని చెప్పాను.
– డా.కిరణ్‌కుమార్, ప్రొఫెసర్, జనరల్‌ సర్జరీ

>
మరిన్ని వార్తలు