-

ఏసీబీ వలలో రెవెన్యూ చేప

12 May, 2018 13:13 IST|Sakshi
డిప్యూటీ తహసీల్దార్‌ను విచారణచేస్తున్న ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర 

రూ. 10 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన

డిప్యూటీ తహసీల్దార్‌ సరుబుజ్జిలి తహసీల్దార్‌

కార్యాలయంలో కలకలం

ఉలిక్కిపడిన ఉద్యోగులు

సరుబుజ్జిలి(శ్రీకాకుళం) : ఓ పక్క ఏసీబీ అధికారుల దాడులు విస్తృతంగా జరుగుతున్నా అధికారులు లంచాలు తీసుకోవడం మానడం లేదు. తమను ఎవరు పట్టిస్తారులే అని మొండిగా వ్యవహరించి చిన్న పనికీ డబ్బులు గుంజుతుండడంతో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి ఏసీబీ అధికారులకు శుక్రవారం చిక్కాడు. సరుబుజ్జిలి తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఎం.నాగేంద్రప్రసాద్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

రూ. 10 వేలు (అన్నీ రూ. 2 వేల నోట్లే) లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తన బృందంతో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో మాటువేసి చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం కరణం రాజేంద్ర విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సరుబుజ్జిలి మండలంలో నందికొండ గ్రామానికి చెందిన గుర్రాల ఈశ్వరరావు నందికొండ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 4/1లో 2.50 ఎకరాల భూమికి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) కోసం గత 3 నెలలుగా సరుబుజ్జిలి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.

అయితే ఇక్కడ పనులు చేయడంలేదని, పని జరగాలంటే లంచాలు డిమాండ్‌ చేస్తున్నట్టు తమ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడని చెప్పారు. లంచాలు ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్‌ కార్యాలయంపై దాడులు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌ నాగేంద్రప్రసాద్‌ను పట్టుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన ఉద్యోగి నుంచి పూర్వాపరాలు విచారించి కేసు నమోదు చేసి, విశాఖపట్నం ఏసీబీ కోర్టులో సరౌండ్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమేష్, శ్రీనివాస్‌  పాల్గొన్నారు.

తహసీల్దార్‌ వివరణ

ఏసీబీ దాడులు విషయమై స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలోని తహసీల్దార్‌ జేమ్స్‌ ప్రభాకర్‌ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా అడ్డదారుల్లో పనులు చేయాలని తమపై ఒత్తిళ్లు చేస్తున్నారని ఆయన అన్నారు. తప్పుడు పనులు చేయనందుకు లేనిపోని ఆరోపణలు చేసి ఉద్యోగులను బలిచేస్తున్నారని వివరించారు.

ఉద్యోగులు పరుగులు

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో పలు శాఖల అధికారులు ఉలిక్కిపడ్డారు. దీంతో తామెక్కడ ఉరిలో పడతామన్న భయంతో తమ సీట్లు వదిలి బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది తహసీల్దార్‌ కార్యాలయం సిబ్బంది సెల్‌ఫోన్లు ఆపు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

రెండవసారి దాడులు

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రెండవ సారి దాడి చేశారు. గతంలో దాడిచేసిన సంఘటనలో నాటి తహసీల్దార్‌ భాస్కరరావు, ఆర్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కావాలనే బలిచేశారు

నేను విధుల్లోకి వచ్చాక ఇక్కడ కార్యాలయంలో జరుగుతున్న తెరచాటు వ్యవహారాలకు చెక్‌ పెట్టాను. కొంతమంది కక్షకట్టారు. నందికొండ రెవెన్యూ పరిధిలోని హైలెవల్‌ కాలువ సమీపంలోని భూములకు నిరభ్యంతర పత్రం కోసం కొంతమంది దరఖాస్తు చేశారు. దరఖాస్తును సర్వేయర్, ఆర్‌ఐ, వీఆర్వోల పరిశీలన కోసం పంపించాను. తప్పుడు ధ్రువీకరణపత్రాలు అందించాలని ఒత్తిడి చేశారు. మూత్ర విసర్జన కోసం బయటకువెళితే బలవంతంగా జేబులో డబ్బులు పెట్టి కావాలనే ఇరికించారు. – ఎం.నాగేంద్రప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్, సరుబుజ్జిలి

కాళ్లరిగేలా తిరుగుతున్నా...

అధికారులకు లంచాలు ఇవ్వనిదే పనులు జరగడంలేదు. నందికొండ రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 4/1లోని రెండున్నర ఎకరాల భూమికి నిరభ్యంతర ధ్రువీకరణపత్రం కోసం 3 నెలలుగా తిరుగుతున్నాను. రూ. 80 వేలు ఇవ్వనిదే పనిచేయమని డిప్యూటీ తహసీల్దార్‌ చెప్పడంతో విసిగి రూ. 10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు అంగీకరించి, ఏసీబీకి ఫిర్యాదు చేశాను. అవినీతిని అరికట్టకపోతే సామాన్యులకు న్యాయం జరగదు.
– గుర్రాల ఈశ్వరరావు, ఫిర్యాదుదారు, నందికొండకాలనీ

మరిన్ని వార్తలు