ఏసీబీ వలలో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌

26 Feb, 2019 06:27 IST|Sakshi
డీఐ జితేందర్‌రెడ్డి స్వాధీనం చేసుకున్న నగదు

రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత  

చోరీ కేసులో సెటిల్మెంటుకు యత్నం

హయత్‌నగర్‌: అవినీతి అధికారులపై ఏసీబీ వరుసగా దాడులు చేస్తున్నా వారు తమ వైఖరి మార్చుకోవడం లేదు. తాజాగా హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌(డీఐ)గా పనిచేస్తున్న జితేందర్‌రెడ్డి  బంగారం దొంగతనం కేసులో నిందితులపై కేసు నమోదు చేయకుండా సెటిల్‌మెంట్‌ చేసేందుకు నిందితుల నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీలో ఓ మహిళ వ్యభిచార కేంద్రం నిర్వహించేది. ఆమెకు నగరానికి చెందిన నాగరాజు, హాలియాకు చెందిన నరేష్‌తో పరిచయం ఏర్పడింది. వారం క్రితం తన ఇంట్లో ఉన్న 3.5 తులాల బంగారు నగలు చోరీకి గురికావడంతో నరేష్, నాగరాజులపై అనుమానం వ్యక్తం చేస్తూ వారం రోజుల క్రితం హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అనుమానితులను స్టేషన్‌కు పిలిపించిన డీఐ జితేందర్‌రెడ్డి కేసు లేకుండా మహిళతో సెటిల్మెంట్‌ చేసేందుకు రూ.1.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఇందులో భాగంగా ఐదు రోజుల క్రితం నరేష్‌ తన వాటాగా రూ. 55 వేలు ఇచ్చాడు. మిగతా డబ్బుల కోసం నాగరాజుపై ఒత్తిడి తేవడంతో అతను ఈ విషయాన్ని తన బావ సాగర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. సాగర్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నాగరాజుకు రూ. 30 వేలు ఇచ్చి పంపారు. అతను డబ్బులను కవర్‌లో పెట్టి డీఐకి ఇచ్చేందుకు ప్రయత్నించగా అతను వాటిని టేబుల్‌పై పెట్టాలని సూచించాడు. అనంతరం నగదును మరో కవర్‌లోకి మార్చి తీసుకున్నాడు.

ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు...
తన చేతులతో డబ్బులను పట్టుకున్న జితేందర్‌రెడ్డి అనుమానంతో వేలిముద్రలు పడకుండా చేతులను కడుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. చేతులు కడుక్కుని తన హ్యాండ్‌ కర్చీప్‌తో తుడుచుకోడంతో వేలి ముద్రలు సేకరించలేకపోయామన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు రాఘవేందర్, రఘునందన్, మాజిద్‌ అలీఖాన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు