ప్రముఖ రిసార్ట్‌ సీఎండీ అరెస్ట్‌

9 Jan, 2019 21:09 IST|Sakshi

హైదరాబాద్‌: నగర శివార్లలోని ఓ ప్రముఖ రిసార్ట్‌ సీఎండీని అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేతకు పాల్పడినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నట్టు డైరెక్టర్‌ జనరల్ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) తెలిపింది. కస్టమర్ల నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్న సదురు రిసార్ట్‌ నిర్వాహకులు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 13.81 కోట్ల రూపాయలు జీఎస్టీ మొత్తాన్ని పక్కదారి పట్టించినట్టు డీజీజీఐ అధికారులు పేర్కొన్నారు. 

చట్ట ప్రకారం వినియోగదారుని నుంచి వసూలు చేసే జీఎస్టీని నిర్ణీత గడువులోపు నేరుగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కానీ సదురు రిసార్ట్‌ ఈ నిబంధనలను పట్టించుకోకుండా.. పన్ను ఎగవేతకు పాల్పడిందని వెల్లడించారు. ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ సదురు రిసార్ట్‌కు, గతంలో పలుమార్లు నోటీసులు అందజేసినట్టు వెల్లడించారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. రిసార్ట్‌ ఎండీ విచారణకు సహకరించకపోవడంతో అతనికి ఈ నెల 18 రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు.

మరిన్ని వార్తలు