బిల్లు చెల్లించలేదని హోటల్‌ యజమాని దాష్టీకం

6 Sep, 2019 08:09 IST|Sakshi

లక్నో: డబ్బు.. మనుషులను రాక్షసులను చేస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. బిల్లు చెల్లించలేదనే కోపంతో ఓ హోటల్ యజమాని కస్టమర్‌ను చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాదోమీ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. సూరజ్ సింగ్, విశాల్‌ దూబే అనే యువకులు భోజనం కోసం ఓ హోటల్‌కు వెళ్లారు. భోజనం తర్వాత వెయిటర్ వారికి రూ.180 బిల్లు ఇచ్చాడు. అయితే తాము తిన్న భోజనానికి ఎక్కువ బిల్లు వేశారంటూ సూరజ్, విశాల్‌లు హోటల్ యజమానితో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ కాస్తా పెద్దదై కొట్టుకొనేవరకు వెళ్లింది. ఆగ్రహించిన హోటల్‌ యజమాని గుర్మయిల్, అతడి కుమారుడు సురేంద్ర సింగ్‌లు, సిబ్బందితో కలిసి కర్రలు, ఇనుప రాడ్లతో విశాల్‌, సూరజ్‌లపై దాడి చేశారు.

ఈ ఘటనలో విశాల్ అక్కడ నుంచి తప్పించుకోగా.. సూరజ్‌ను తీవ్రంగా కొట్టారు. గాయాలతో కదల్లేని పరిస్థితిలో ఉన్న సూరజ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్మయిల్, సురేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన ఇద్దరు వెయిటర్లు పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు