డీజిల్‌ చోరీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్‌

14 Feb, 2019 11:28 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ ఉమా మహేశ్వర శర్మ

రూ.4.29లక్షల నగదు స్వాధీనం, ట్యాంకర్‌ సీజ్‌

పరారీలో మరో ఐదుగురు నిందితులు

ప్రత్యేక బృందాలతో గాలింపు

నేరేడ్‌మెట్‌: డీజిల్‌ చోరీ కేసులో పోలీసులు మరో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు.ఈ ఘటనకు సంబందించి గత నెలలో నలుగురిని అరెస్టు చేసిన విదితమే. తాజా బుధవారం ప్రధాన సూత్రదారితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ  కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గత డిసెంబర్‌ నెలలో ఘట్‌కేసర్‌–చర్లపల్లి మధ్య  ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ), భారత్‌ పెట్రోల్‌ కార్పొరేషన్‌(బీపీసీ)కు చెందిన ప్రధాన పైప్‌లైన్‌కు కన్నం వేసిన అంతర్రాష్ట్ర ముఠా దాదాపు 1.30లక్షల లీటర్ల డీజిల్‌ను చోరీ చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన  మల్కాజిగిరి సీసీఎస్‌ పోలీసులు గత జనవరి 17న నలుగురు నిందితులను అరెస్టు చేసి రూ.90.40లక్షల నగదును స్వాధీనం చేసుకొని, ట్యాంకర్‌ను సీజ్‌ చేశారు.

  స్క్రాప్‌ వ్యాపారం పేరుతో ఘట్‌కేసర్‌ ప్రాంతంలో స్థలం లీజుకు తీసుకొని ముఠా సభ్యులతో కలిసి ఈ చోరీకి పథకం రూపొందించిన సూత్రదారి ముంబైకి చెందిన స్క్రాప్‌ వ్యాపారి సర్వర్‌ షేక్‌ అలియాస్‌ సజ్జు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ట్యాంకర్‌ యజమాని/డ్రైవర్‌ సురేష్‌కుమార్‌ ప్రజాపతిలను బుధవారం సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4,29,878 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.   చోరీ చేసిన డీజిల్‌ను ప్రజాపతి తన ట్యాంకర్‌లో మహారాష్ట్రలోని కరాడ్, సిరూర్‌లోని కేన్‌ అగ్రోస్, సాయికృపా షుగర్‌ కంపెనీలకు తరలించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. సర్వర్‌షేక్‌పై ముంబైలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు జియాఉల్‌ చాంద్‌ షేక్, సునీల్‌అనిల్, వాసు, శ్రీకాంత్, నరేష్‌రెడ్డి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వరంగల్‌లో డీజిల్‌ విక్రయంపై ఆధారాలు సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ శివకుమార్, మల్కాజిగిరి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు లింగయ్య, జగన్నాథ్‌రెడ్డి, రుద్రభాస్కర్, కీసర సీఐ ప్రకాష్, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, కృష్ణారావు, నర్సింహులు, శివప్రసాద్, శ్రీకృష్ణ, రవి,  గోవింద్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు