మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

2 Oct, 2019 11:53 IST|Sakshi
బావిలో నుంచి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చుతున్న దృశ్యం (ఇన్‌సెట్‌లో)స్వప్న (ఫైల్‌) 

సాక్షి, వరదయ్యపాళెం(చిత్తూరు) : తల్లిదండ్రులు మందలించారనే కోపంతో మనస్తాపానికి గురైన బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సత్యవేడు పట్టణంలో మంగళవారం జరిగింది. సత్యవేడు సీఐ బీవీ శ్రీనివాసులు కథనం మేరకు సత్యవేడులోని బలిజ వీధికి చెందిన చెంచురాముడు, కవిత దంపతుల రెండో కుమార్తె స్వప్న స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతుంది. ఆదివారం రాత్రి తల్లిదండ్రులు మందలించారని ఆమె మనస్తాపానికి గురైంది. సోమవారం వేకువజామున ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఆమె అదృశ్యమైందని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం సత్యవేడు కాళమనాయుడుపేట సమీపంలోని వ్యవసాయ బావిలో స్వప్న శవమై తేలింది. స్థానికులు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నాగార్జునరెడ్డి తెలిపారు.  

ఉరేసుకుని మరో యువకుడు
చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంకు చెందిన సి.జ్ఞానేష్‌నాయుడు(26) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సాంబయ్యకండ్రిగ ఇందిరమ్మ కాలనీలో కాపురముంటున్న జ్ఞానేష్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని మంగళవారం పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతికిగల కారణాలపై విచారణ నిర్వహిస్తున్నట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు