దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: ఎఫ్‌ఐఆర్‌ కాపీలో..

13 Dec, 2019 11:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ కాపీ సాక్షి టీవీ చేతికి చిక్కింది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం... బాధితురాలు దిశ వస్తువులను రికవర్‌ చేయడంలో భాగంగా డిసెంబరు 6న నిందితులను ఘటనాస్థలం చటాన్‌పల్లికి పోలీసులు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఉదయం ఆరున్నర గంటలకు నిందితులు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డారు. ఆయుధాలు లాక్కొన్ని పోలీసులను హతమార్చాలని చూశారు. ఆత్మరక్షణకై పోలీసులు కాల్పులు జరుపగా నలుగురు నిందితులు చనిపోయారు. ఈ మేరకు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ ఫిర్యాదుతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల వయస్సు 19 సంవత్సరాలుగా పేర్కొన్నారు. కాగా దిశ హత్యానంతరం పోలీసులు మాట్లాడుతూ నిందితుల వయస్సు 20 సంవత్సరాలు అని పేర్కొన్న విషయం తెలిసిందే.

మరోవైపు దిశ అత్యాచారం, హత్య కేసులో ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌) నివేదిక పోలీసులకు అందింది. కాలిపోయిన దిశ శరీరం స్టెర్నమ్‌ బోన్‌ నుంచి సేకరించిన డీఎన్‌ఏ ఆధారంగా.. ఆ మృతదేహం దిశదే అని నిర్ధారణ అయ్యింది. అదే విధంగా ఘటనాస్థలంలోనే నిందితులు అత్యాచారం చేసినట్లుగా స్పష్టమైన ఫోరెన్సిక్‌ ఆధారాలు లభించాయి. ఈ కేసులో కీలకంగా మారిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఆధారంగా నిజానిజాలు నిర్ధారణ కానున్నాయి.

కాగా వెటర్నరీ డాక్టర్‌ దిశను నలుగురు నిందితులు చటాన్‌పల్లి వద్ద పాశవికంగా అత్యాచారం చేసి, హత్యకు పాల్పడి ఆమె మృతదేహాన్ని కాల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఘటనపై నిరసనలు వెల్లువెత్తగా.. నిందితులను అదపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. ఈ క్రమంలో క్రైం సీన్‌ రీకన్‌ష్ట్రక్షన్‌ కోసం నిందితులను ఘటనాస్థలికి తీసుకువెళ్లగా అక్కడ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో నిందితులు మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు శివ, జొల్లు నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిందితులది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా... విచారణ జరిపిన న్యాయస్థానం... ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్‌ను నియమించింది.(ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్‌)

మరిన్ని వార్తలు