దిశ కేసు: దర్యాప్తులో కీలక అంశాలు

5 Dec, 2019 13:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వాలు, పోలీసులు అనుసరిస్తున్న తీరుకు సవాలుగా నిలిచిన దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన షాద్‌నగర్‌ దిశ కేసు దర్యాప్తును సైబరాబాద్‌ పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఏడు బృందాలు రంగంలోకి దిగి సాక్ష్యాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో దిశ కేసులో కీలకంగా మారిన ఆమె సెల్‌ఫోన్‌ను నిందితులు పాతిపెట్టినట్లుగా గుర్తించినట్లుగా సమాచారం. దీంతో మరిన్ని ఆధారాల కోసం ఘటనాస్థలంలో క్లూస్ టీం మరోసారి తనిఖీలు చేపట్టింది. బాధితురాలి ఫోన్‌ లభ్యమైన నేపథ్యంలో ఆమె కాల్ లిస్టు, కాల్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా దిశపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హత్య చేసిన నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొచి విచారించేందుకు డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి నేతృత్వంలో విచారణ బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ బృందం ఇప్పటికే మహ్మద్ ఆరిఫ్‌, నవీన్, శివ, చెన్నకేశవులును అదుపులోకి తీసుకొని.. విచారణను కొనసాగిస్తుంది. ఇక మిగిలిన పోలీసు బృందాల్లో ఒక బృందం సాక్ష్యాలను సేకరించనుండగా.. మరో బృందం ఫోరెన్సిక్ , డీఎన్‌ఏ ఆధారాలను పరిశీలించనుంది. ఇంకొక బృందం లీగల్ ప్రొసీడింగ్స్‌ సమర్థంగా చేపట్టేందుకు ఏర్పాటైంది. కేసులో ప్రధానంగా ఉన్న ప్రత్యక్ష సాక్షుల విచారణ, ఐడెంటిఫికేషన్ పరేడ్ కోసం మరొక టీమ్ రంగంలోకి దిగింది.

మరిన్ని వార్తలు