ఆర్టీసీ బస్సును ఢీకొన్న దివాకర్‌ బస్సు

19 Aug, 2019 06:28 IST|Sakshi
ప్రమాద దృశ్యం

ఏడుగురు ప్రయాణికులకు గాయాలు 

సాక్షి, కళ్యాణదుర్గం రూరల్‌: అతివేగం కొంపముంచింది.. ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సును దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు వెనుకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఉదయం 9.20 గంటలకు కళ్యాణదుర్గం డిపో నుంచి ఆర్టీసీ బస్సు అనంతపురం బయల్దేరింది. గోళ్ల గ్రామం వద్దకు చేరుకోగానే ప్రయాణికులను ఎక్కించుకునే క్రమంలో ముందు వైపు కాస్త నెమ్మదిగా వెళ్లింది. అయితే అదే సమయంలో వెనుక వైపు అతి వేగంగా వచ్చిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు వెనుక వైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. వెనుకవైపున్న ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. దివాకర్‌ బస్సులో ముందు వైపు కూర్చున్న గోళ్లకు చెందిన మూలప్ప, ఐదుకల్లుకు చెందిన భవాని దంపతులు, రాయలప్పదొడ్డికి చెందిన లక్ష్మమ్మ, గోనబావికి చెందిన సంజీవప్ప, చిన్న హనుమంతు, మాకొడికి గ్రామానికి చెందిన ధనుంజయ, యర్రమలేపల్లికి చెందిన వరదరాజులుకు గాయాలయ్యాయి.  

మానవత్వం చాటుకున్న ఆర్డీఓ 
అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న ఆర్డీఓ రామ్మోహన్‌ గోళ్ల గ్రామం వద్ద జరిగిన ప్రమాదాన్ని చూసి వెంటనే తన వాహనాన్ని ఆపారు. గాయాలతో బాధపడుతున్న వారిలో కొందరిని తన వాహనంలో ఎక్కించుకుని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మిగిలిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి చేర్చారు. ఆర్డీఓ మానవత్వం చూసి ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డీఎం రామచంద్రనాయుడు, రూరల్‌ ఏఎస్‌ఐ ఈశ్వరయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద సంఘటన గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.  

మరిన్ని వార్తలు