మాజీ ఎమ్మెల్యేకి పదేళ్ల జైలు

29 Dec, 2018 09:02 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే ఎం. రాజ్‌కుమార్‌

 రూ.42 వేల జరిమానా∙చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పు

సాక్షి ప్రతినిధి, చెన్నై: బాలికపై అత్యాచారం కేసులో డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎం. రాజ్‌కుమార్‌ (52)కు పదేళ్ల జైలు శిక్ష, రూ.42 వేల జరిమానా విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 2006లో పెరంబలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఇతని ఇంట్లో పనిచేసింది. అయితే పనిలో చేరిన కొద్ది రోజులకే ఆ బాలిక తన తల్లికి ఫోన్‌ చేసి ఇక్కడ ఉండలేనని, తనను తీసుకెళ్లాలని కోరింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పెరంబలూరు ప్రయాణమవుతుండగా, రాజ్‌కుమార్‌ స్నేహితుడు జయశంకర్‌  ఫోన్‌ చేసి అనారోగ్యం కారణంగా బాలికను ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పాడు.

తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి బాలికను చూడగా స్పృహలేని స్థితిలో కనిపించింది. చికిత్స పొందుతూనే మరణించింది. తన కూతురు మరణంలో పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరంబలూరు పోలీసులు కేసు నమోదు చేసి, శవపంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురై మరణించినట్లు తేలింది. దీంతో డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, అతని స్నేహితులు జయశంకర్, అన్బరసు, మహేంద్రన్, హరికృష్ణ, పన్నీర్‌ సెల్వం సహా ఏడుగురిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసును సీబీసీఐడీ విచారణ చేపట్టి రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసింది. కేసు పెరంబలూరు న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలోనే పన్నీర్‌ సెల్వం చనిపోయాడు. రాజ్‌కుమార్‌ మాజీ ఎమ్మెల్యే కావడంతో ప్రజా ప్రతినిధుల నేరాల విచారణకు ఏర్పడిన ప్రత్యేక కోర్టుకు ఈ కేసు చేరింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శాంతి నిందితులైన మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, జయశంకర్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ. 42 వేల జరిమానా విధించారు.

మరిన్ని వార్తలు