సండే బజార్‌లో కొనద్దురో ! 

3 Feb, 2019 22:21 IST|Sakshi

బెంగళూరు : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు నగర ప్రజలు చవకగా వస్తాయని బెంగళూరు నగరంలోని సండే బజార్‌లో కొనుగోలు చేస్తున్న సెల్‌ఫోన్లు వారి మెడకు చుట్టుకుంటున్నాయి. తక్కువ ధరకే బ్రాండెడ్‌ మొబైళ్లు లభిస్తాయన్న ఆశతో   సండేబజార్‌లో మొబైళ్లు కొనుగోలు చేసిన వారు పదుల సంఖ్యలో పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైన్‌స్నాచింగ్‌లతో పాటు మొబైళ్ల చోరీలపై కూడా రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండడంతో దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. చోరీ, దోపిడీ ఘటనల్లో దోచుకున్న మొబైళ్లను దొంగలు సండేబజార్‌లో మొబైల్‌ దుకాణాలకు విక్రయిస్తుండడాన్ని పసిగట్టిన పోలీసులు కొద్ది రోజుల క్రితం సండేబజార్‌లోని మొబైళ్ల దుకాణాలపై మెరుపుదాడులు చేసి వందల సంఖ్యలో మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల యజమానుల వెల్లడించిన సమాచారంతో దుకాణాలకు మొబైళ్లు విక్రయించిన నిందితులు, దుకాణాల నుంచి మొబైళ్లు కొనుగోలు చేసిన వ్యక్తుల కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు.. 

రెండు ముఠాలు 
రెండు ముఠాలు సండేబజార్‌లోని దుకాణాలకు మొబైళ్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. అందులో ఒక ముఠా  రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులను, పాదచారులను మారణాయుధాలతో బెదిరించి ఖరీదైన మొబైళ్లు దోచుకొని సండేబజార్‌లో విక్రయిస్తారు. రెండవ ముఠా పాదచారులను  నుంచి మొబైళ్లు లాక్కెళ్లడం అదేవిధంగా బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, చిత్రమందిరాలు, మార్కెట్‌లు తదితర రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొబైళ్లు చోరీ చేసి సండేబజార్‌లో విక్రయిస్తారు. కాగా రెండు ముఠాల్లోని సభ్యులు పాతికేళ్లలోపు యువకులే ఉంటుండడం గమనార్హం. జల్సాలకు అలవాటు పడే యువకులు చోరీల బాటపడుతున్నారని పోలీసులు తెలుపుతున్నారు.. 

నకిలీ పత్రాలు సృష్టించి 
చోరీ చేసిన మొబైళ్లను నిందితులు అతితక్కువ ధరలకు సండేబజార్‌లోని దుకాణాలకు విక్రయిస్తారు. అనంతరం దుకాణాల యజమానులు మొబైళ్లకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తుండగా మరికొంత మంది ఐఎంఈఐ నంబర్లు మార్చి విక్రయిస్తున్నారు. ఈ రెండు విధానాల్లో కాకుండా మరికొంతమంది ఫోన్‌లలోని విడిభాగాలను విక్రయించి సొమ్ము చేసుకుంటారు.   

కొనుగోలు చేసిన వ్యక్తుల కోసం వేట... 
దుకాణాల నుంచి వందల సంఖ్యలో మొబైళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు మొబైళ్లు విక్రయించిన నిందితులతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు కూడా చెప్పాలంటూ దుకాణాల యజమానులకు నోటీసులు అందించారు. దీంతో పాటు ఇప్పటివరకు ఐఈఎంఐ నంబర్లు మార్చేసి విక్రయించిన మొబైళ్ల సమాచారం కూడా అందించాలంటూ నోటీసులు సూచించారు. దీంతో తక్కువ ధరలకే బ్రాండెడ్‌ మొబైళ్లు వస్తున్నాయంటూ ఎగబడి కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా పోలీసుస్టేషన్‌ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. తక్కువ ధరలకే మొబైళ్లు వస్తున్నాయనే ఆశతో ప్రజలు ఎవరు కూడా సండేబజార్‌లో మొబైళ్లు కొనుగోలు చేయరాదంటూ పోలీసులు సూచిస్తున్నారు.  

ప్రత్యేక వెబ్‌సైట్‌... 
చోరీ, దోపిడీ ఘటనల్లో పోగొట్టుకున్న మొబైల్, ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్‌ తదితర వస్తువులను తిరిగి పొందడానికి పోలీసులు ‘ఈ లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌’ పేరుతో ప్రత్యేక మొబైల్‌యాప్‌ రూపొందించారు.ఈ యాప్‌ ద్వారా స్టేషన్‌కు వెళ్లకుండానే తాము పోగొట్టుకున్న వస్తువుల వివరాలను యాప్‌లో పొందుపరచి ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు సుమారు 300 వస్తువులు వాటి యజమానులకు అప్పగించినట్లు పోలీసులు తెలుపుతున్నారు.   

మరిన్ని వార్తలు