డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్య

31 Aug, 2019 04:42 IST|Sakshi
డాక్టర్‌ రామకృష్ణంరాజు, లక్ష్మీదేవి, డాక్టర్‌ కృష్ణసందీప్‌ మృతదేహాలు

అమలాపురంలో ఆత్మహత్య చేసుకున్న వైద్యుడు, భార్య, కుమారుడు

నన్నూ రమ్మన్నారంటూ.. విలపించిన చిన్న కుమారుడు 

అమలాపురం టౌన్‌: అప్పుల బాధతో ఓ వైద్యుడితో పాటు ఆయన భార్య, కుమారుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం నింపింది. కాలేజీ రోడ్డులో శ్రీకృష్ణ ఆర్థోపెడిక్‌ అండ్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు పెన్మత్స రామకృష్ణంరాజు (55), ఆయన భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు డాక్టర్‌ కృష్ణసందీప్‌ (25) సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. శస్త్ర చికత్సల సమయంలో మత్తు (ఎనస్తీషియా) కోసం రోగికి ఇచ్చే సుకాల్‌ (నిద్ర) ఇంజక్షన్, ఊపిరిని నిలిపివేసేందుకు ఉపయోగించే మెడిజొలామ్‌ ఇంజక్షన్‌ను ఒకేసారి సిరంజీల ద్వారా సెలెన్‌ బాటిల్స్‌లో ఉంచి చేతుల నరాలకు ఎక్కించుకుని మత్తులోకి వెళ్లి ప్రాణాలు విడిచారు.

కృష్ణసందీప్‌ ఇప్పటికే ఎంబీబీఎస్‌ పూర్తిచేశాడు. వీరి చిన్న కుమారుడు వంశీకృష్ణ రాజమహేంద్రవరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. గురువారం రాత్రి తండ్రి తనకు ఫోన్‌ చేసి.. ‘అప్పుల బాధ పడలేకపోతున్నా.. అందరం ఆత్యహత్య చేసుకోవడమే శరణ్యం.. నువ్వు కూడా అమలాపురం రా’ అని కోరాడని, అయితే తాను తన తండ్రికి ధైర్యం చెప్పానని.. శుక్రవారం పరీక్ష ఉండటంతో ఇంటికి వెళ్లలేదని వంశీకృష్ణ చెప్పాడు. అంతలోనే దారుణం జరిగిపోయిందని కన్నీళ్లపర్యంతమయ్యాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో చిలకలపేటకు చెందిన డాక్టర్‌ రామకృష్ణంరాజు అమలాపురానికి వలసవచ్చి 15 ఏళ్లుగా ఇక్కడే ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. 

ప్రాక్టీసు బాగానే ఉంది కానీ.. 
డాక్టర్‌ రామకృష్ణంరాజుకు సొంత భవనంతో పాటు వైద్యపరంగా ప్రాక్టీస్‌ బాగానే ఉంది. అయితే ఆయన ఇటీవల కాలంలో రియల్‌ ఎస్టేట్‌ వైపు అడుగులు వేసి భూములు కొనడం, అమ్మడం చేస్తున్నారు. ఈ వ్యాపార లావాదేవీల్లో ఆయన తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఆయన పలు వాణిజ్య బ్యాంకులు, ప్రైవేట్‌ ఫైనాన్సర్ల వద్ద అప్పులు చేశారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి డాక్టర్‌ను బురిడీ కొట్టించి రూ.రెండు కోట్లు కాజేశాడు. దాదాపు రూ. 10 కోట్లకు పైగా అప్పులున్నట్టు పోలీసులు తేల్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు