డాక్టర్‌ తప్పిదం.. శిశువుకు శాపం

25 Dec, 2019 09:56 IST|Sakshi
కుమారుడు సర్వేశ్వరన్‌తో రమీలా

మక్కీలో ఇరుక్కున్న సూది పట్టించుకోని డాక్టర్‌

తమిళనాడు, సేలం: ఒకటిన్నర సంవత్సరాల శిశువు మక్కీలో సూది చిక్కుకున్నా పట్టించుకోని డాక్టరుపై తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడులో ఎట్టిమడైపుదూర్‌ గ్రామానికి చెందిన రమీలా (26). ఈమె భర్త కార్తికేయన్‌తో గొడవ కారణంగా పుట్టింటిలో ఉంటోంది. ఈమెకు ఒకటిన్నర సంవత్సరం వయస్సు కలిగిన సర్వేశ్వరన్‌ కుమారుడు ఉన్నాడు. గత నెల నవంబర్‌ 15వ తేదీ బిడ్డను తామరై కన్నన్‌ డాక్టర్‌ వద్దకు తీసుకువెళ్లగా అక్కడ ఆ బిడ్డకు సరళ, హిందుమతి అనే ఇద్దరు నర్సులు సూది వేసినట్లు తెలుస్తోంది.

అప్పుడు అకస్మాత్తుగా ఆ సూది బిడ్డ మక్కీలో ఉండి పోయినట్లు తెలుస్తోంది. విషయం సంబంధిత డాక్టర్‌కు చెప్పినా పట్టించుకోని పరిస్థితి. ఇదిలాఉండగా నవంబర్‌ 29వ తేదీ కూడా రమీలా బిడ్డను చెకప్‌ కోసం ఆస్పత్రికి తీసుకు వెళ్లింది. అప్పుడు కూడా నర్సులు, డాక్టరు నోరు మెదపలేదు. సర్వేశ్వరన్‌ మక్కి వద్ద బొబ్బ ఏర్పడింది. దాన్ని రమీలా మంగళవారం ఉదయం పగులగొట్టగా అందులో నుంచి సూది వెలుపలి వచ్చింది. రమీలా, బంధువులు మంగళవారం ఆస్పత్రిని ముట్టడించి ఆందోళన చేపట్టారు. డాక్టర్‌ ఆమెను సముదాయించడానికి చూసినట్లు సమాచారం. ఈ విషయంగా రమీలా తిరుచెంగోడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.  

మరిన్ని వార్తలు