పాల్‌ మృతికి నిర్లక్ష్యమే కారణమా!

16 Aug, 2018 11:26 IST|Sakshi
సురాపాటి  పాల్‌ (ఫైల్‌) 

సాలూరు రూరల్‌ : మండలంలోని కందులపధం గ్రామానికి చెందిన దళితుడు సురాపాటి పాల్‌(38) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈయన మృతికి వ్యసనాలే కారణమా? లేక వైద్య సిబ్బంది నిర్లక్ష్యమా? అన్నది తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళ్తే...పాల్‌ థింసా నృత్యానికి డప్పు వాయిస్తూ జీవనం గడుపుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాలూరు సీఎం పర్యటనలో ఈయనకు డప్పు వాయించే అవకాశం లభించింది.

అయితే చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దు కావడంతో పాల్‌ మంగళవారం తోణాంలోని బంధువుల ఇంటికి వేడుకకని వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత 3.30 గంటల సమయంలో ఫిట్స్‌ వచ్చింది. వెంటనే పాల్‌ను తోణాం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో సిబ్బంది పరీక్షించి పాల్‌ శరీరంలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో వైద్యాధికారికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఆయన సూచన మేరకు సాలూరు సీహెచ్‌సీకి తరలించాలని సూచించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో 108కి ఫోన్‌ చేయగా 5.15కు వాహనం రాగా అప్పటికే పాల్‌ మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. 

ఉదయాన్నే వచ్చా..

దీనిపై స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ స్వాతిని వివరణ కోరగా తాను మంగళవారం సారిక సబ్‌సెంటర్‌కు వెళ్లానని చెప్పారు. పాల్‌ ఉదయం ఆస్పత్రికి వచ్చారని సిబ్బంది పాల్‌కు రక్త పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఇచ్చారని తెలిపారు. పాల్‌ అతిగా సారా తాగడమే మృతికి కారణం కావచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు నివేదించానని చెప్పారు.

మరిన్ని వార్తలు