పెట్రోల్‌ బాటిళ్లు నడుముకు కట్టుకుని... 

12 Feb, 2020 05:08 IST|Sakshi

గాంధీలో వైద్యుడు వసంత్‌కుమార్‌ హల్‌చల్‌

గంటన్నరపాటు హైడ్రామా

చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

చిలకలగూడ పోలీసులకు సీపీ నజరానా

గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో డాక్టర్‌ వసంత్‌కుమార్‌ మంగళవారం నడుముకు పెట్రోల్‌ బ్యాటిళ్లు, చేతిలో లైటర్‌తో హల్‌చల్‌ చేశారు. సుమారు గంటన్నర పాటు పోలీసులు, వైద్య సిబ్బందికి ముచ్చెమటలు పట్టించారు. చివరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బేగంపేట ఠాణాకు తరలించారు. ఈ ఘటనలో చాకచక్యంగా వ్యవహరించిన చిలకలగూడ పోలీసులకు నగర కొత్వాలు రూ.10,000 నజరానా ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో డాక్టర్‌ వసంత్‌కుమార్‌ క్యాజువాలిటి మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ)గా విధులు నిర్వహిస్తూ, టీజీజీడీఏ గాంధీ యూనిట్‌ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

కరోనా అనుమానితులకు అందించాల్సిన సేవలపై గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలో ఈ నెల 7న ఆస్పత్రి పాలనాయంత్రాంగం సమావేశమైంది. అక్కడకు వచ్చిన వసంత్‌కుమార్‌ పారిశుధ్య నిర్వహణ, నర్సింగ్‌ సిబ్బంది కొరతపై మాట్లాడుతూ.. ఆర్‌ఎంఓ జయకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరినా వినిపించుకోకుండా పాలనాయంత్రాంగం పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పాలనాయంత్రాంగం వైద్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వసంత్‌కుమార్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌ (డీఎంహెచ్‌)కు సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పెట్రోల్‌ బాటిళ్లు కట్టుకుని
ఈ క్రమంలో వసంత్‌కుమార్‌ మంగళవారం మధ్యాహ్నం 12.05 గంటలకు మూడు లీటర్ల పెట్రోల్‌ను బాటిళ్లలో నింపి నడుముకు కట్టుకుని, చేతిలో లైటర్‌ పట్టుకుని గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం వద్దకు చేరుకున్నారు. తనను అన్యాయంగా సరెండర్‌ చేశారని, గాంధీ ఆస్పత్రిలో అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే ఇలా చేశారని ఆరోపించారు. పోలీసులు, వైద్యులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దగ్గరకు వస్తే నిప్పంటించుకుంటానని బెదిరించడంతో దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. సుమారు గంటన్నరపాటు హైడ్రామా కొనసాగింది.

పరిస్థితి చేయిదాటుతుందని భావించిన పోలీసులు వ్యూహం సిద్ధం చేశారు. వసంత్‌కుమార్‌తో మీడియా ప్రతినిధులు మాట్లాడుతుండగా సీఐ బాలగంగిరెడ్డి ఒక్క ఉదుటన అతన్ని సమీపించి చేతిని వెనకకు విరిచి పట్టుకుని లైటర్‌ను గుంజుకోగా, మిగిలిన సిబ్బంది క్షణాల్లో ఆయన నడుముకున్న బాటిళ్లను తీసేశారు. అనంతరం బేగంపేట ఠాణాకు తరలించారు. ఈ ఘటనను జనరల్‌ డైరీ (జీడీ)లో పొందుపర్చామని, న్యాయనిపుణుల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చిలకలగూడ సీఐ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి వైద్యుని ప్రాణాలు కాపాడినందుకు నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌.. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, పోలీస్‌ సిబ్బందికి రూ.10 వేల నజరానా ప్రకటించారు.

కన్నీటిపర్యంతమైన జ్యోతిర్మయి....  
వసంతకుమార్‌ భార్య జ్యోతిర్మయి గాంధీ గైనకాలజీ విభాగంలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. నిండు గర్భిణి అయిన ఆమె ఆస్పత్రిలో జరిగిన ఘటనను చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, వసంత్‌ కుమార్‌ ఆస్పత్రి ప్రాంగణంలో చేసిన చర్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లం ప్రవీణ్‌ ఖండించారు. వసంత్‌కు అన్యాయం జరిగితే ఉన్నతాధికారులతో సమావేశమై చర్చిస్తామన్నారు.

ప్రజారోగ్య విభాగానికి... 
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్వహించిన సమీక్షలో ఆర్‌ఎంవోను దుర్భాషలాడిన విషయంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా డాక్టర్‌ వసంత్‌ను ప్రజారోగ్య సంచాలకుడికి అప్పగించామని వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తూ వసంత్‌కుమార్‌ ఆస్పత్రిలో ఫార్మసీ కుంభకోణం జరిగిందని డీఎంఈ రమేశ్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై రమేశ్‌రెడ్డి స్పందించారు. కొద్దికాలంగా వసంత్‌ ప్రవర్తన బాగోలేదని, తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. ఆర్‌ఎంవోను దుర్భాషలాడిన విషయంపై మాత్రమే వసంత్‌ను సరెండర్‌ చేశామని స్పష్టం చేశారు. అవకతవకలపై ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదని వసంత్‌ను ప్రశ్నించారు.

నడుముకు పెట్రోల్‌ బాటిళ్లతో
వసంత్‌ కుమార్‌. (ఇన్‌సెట్‌లో) లైటర్‌ 

మరిన్ని వార్తలు