కాన్పుకు వస్తే కడుపులో కాటన్‌ వేసి..

17 Jun, 2018 13:39 IST|Sakshi
పసిపాపతో ఆస్పత్రి ఎదుట భైఠాయించి ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు హరిత (ఫైల్‌) 

షాద్‌నగర్‌టౌన్‌ : వైద్యుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైన సంఘటన షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఎనిమిది నెలలుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. షాబాద్‌ మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన హరిత(25)ను ఏడాదిన్నర కిత్రం అదే మండలంలోని  అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన రాజుతో వివాహం చేశారు. హరితకు తొలి కాన్పు సమయం దగ్గర పడడంతో గతేడాది అక్టోబర్‌ 3న షాద్‌నగర్‌ పట్టణంలోని విజయ ఆస్పత్రికి తీసుకొచ్చారు. హరితను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్‌ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. కుటుంబీకుల అంగీకారంతో అక్టోబర్‌ 5న ఆపరేషన్‌ చేయడంతో హరిత తొలికాన్పులో పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది.

పాపను చూసి మురిసిపోయిన ఆ కుటుంబ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఆపరేషన్‌ అయిన కొన్ని నెలల్లోనే హరిత అనారోగ్యానికి గురైంది. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. హరితకు స్కానింగ్‌ చేసి ఆమె కడుపులో కాటన్‌ ఉన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఉస్మానియా వైద్యులు ఆమెకు ఆపరేషన్‌ చేసి కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడలేదు. కొన్ని నెలలుగా మృత్యువుతో పోరాటం చేసి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హరిత మృతి చెందింది.  

ఆస్పత్రి ఎదుట పసిపాపతో ధర్నా 
మృతురాలి కుటుంబీకులు శనివారం సాయంత్రం షాద్‌నగర్‌లోని విజయ ఆస్పత్రి ఎదుట ధర్నా చేప ట్టారు. హరిత కూతురు పసిపాపతో ఆస్పత్రి ఎదు ట బైఠాయించారు. పసిపాపకు న్యాయం చేయాల ని, నిర్లక్ష్యంగా వ్యహరించి ఆపరేషన్‌ చేసిన వైద్యులను వెంటనే అరెçస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా షాద్‌నగర్‌ పట్టణ సీఐ అశోక్‌కుమార్‌ గట్టి బందోబస్తు చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రి నుండి హరిత మృతదేహాన్ని పోలీసులు నేరుగా ఆమె స్వగ్రామైన షాబాద్‌ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి తరలించారు.  

రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలి 
హరిత మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ బాధిత కుటుంబ సభ్యులు రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చిన్నారి పాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని ఆందోళన చేపట్టిన వారు డిమాండ్‌ చేశారు. అయితే పోలీసులు, స్ధానిక నాయకులు జోక్యం చేసుకొని విజయ ఆస్పత్రి వైద్యులతో చర్చించినట్లు సమాచారం. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలిసింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా