ఆఫీసర్‌ @ ట్రూ కాలర్‌

15 Jun, 2020 08:43 IST|Sakshi
నిందితుడు రాకేష్‌

ట్రూ కాలర్‌లో అధికారిగా నమోదు చేసుకున్న నిందితుడు

దీని ఆధారంగానే ‘డబుల్‌ దగా’లు కొనసాగింపు

వసూలు చేసిన సొమ్మంతా జల్సాలకు వినియోగం

రాకేష్‌ వ్యవహారాలపై ఆరా తీస్తున్న పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళు ఇప్పిస్తానంటూ ఎర వేసి అనేక మంది నిరుపేదల్ని నిండా ముంచిన వై.రాకేష్‌ యాదవ్‌ ‘సాంకేతిక పరిజ్ఞానాన్నీ’ వినియోగించుకున్నాడు. ట్రూ కాలర్‌ యాప్‌లో తన నెంబర్‌ను కలెక్టరేట్‌లో అధికారి అంటూ నమోదు చేసుకున్నాడు. దీని ఆధారంగానే బాధితులకు కాల్స్‌ చేస్తూ వారిని నమ్మించి నిండా ముంచాడు. 17 మంది నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి మోసం చేసిన రాకేష్‌ యాదవ్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఇతడి విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.  ఉప్పుగూడలోని కందిగల్‌గేట్‌ ప్రాంతానికి చెందిన వై.రాకేష్‌ యాదవ్‌ పదో తరగతి వరకు చదివి స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. ఇతడి తండ్రి  వై.అంజయ్య రేషన్‌ కార్డులు ఇప్పించడానికి దళారిగా వ్యవహరించాడు. (‘జేసీ బ్రదర్స్‌’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు )

ఆయన ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల పని తీరుపై రాకేష్‌కు అవగాహన వచ్చింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళకు భారీగా డిమాండ్‌ పెరిగిందని రాకేష్‌ తెలుసుకున్నాడు. దీంతో తానే ఓ ప్రభుత్వ అధికారిగా చెప్పుకుంటూ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిని గుర్తించడం మొదలెట్టాడు. ఇలా చేయడానికి ముందు తన స్మార్ట్‌ ఫోన్‌లో ట్రూ కాలర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. అందులో తన నెంబర్‌ను ‘ఆఫీసర్‌ రంగారెడ్డి కలెక్టరేట్‌’ అంటూ సేవ్‌ చేసుకున్నాడు. దీంతో ఈ నెంబర్‌ నుంచి ఎవరికైనా కాల్స్‌ చేసినప్పుడు ఆ పేరునే ట్రూ కాలర్‌ చూపేది. దీంతో శ్రీనివాస్‌గా చెప్పుకున్న రాకేష్‌ కలెక్టరేట్‌ అధికారి అని తేలిగ్గా నమ్మేవాళ్ళు. దరఖాస్తుదారులకు పూర్తి నమ్మకం కలగడానికి వారి నుంచి దరఖాస్తుతో పాటు ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు ఫొటోలను సంగ్రహించేవాడు. ముందుగా డీడీ కట్టాలంటూ రూ.40 వేల వరకు అడ్వాన్సుగానూ తీసుకునేవాడు. ఆపై తన ఫోన్‌లో సేవ్‌ చేసి ఉండే ‘మీకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు మంజూరైంది. మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ రూ.40 వేలు అందింది. రెండోది చెల్లించండి’ అనే ఎస్సెమ్మెస్‌ను బాధితులకు చూపేవాడు. దీని ఆధారంగా మిగిలిన మొత్తం కూడా తీసుకుని మోసం చేసేవాడు. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం రాకేష్‌ అబిడ్స్, గోషామహల్, కోఠి తదితర ప్రాంతాలకు చెందిన 17 మంది నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశాడు. ఇతడిని అరెస్టు చేసే సమయానికి బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదని అధికారులు చెప్తున్నాడు. దేవరయాంజాల్‌లో ఓ విల్లా అద్దెకు తీసుకుని ఉంటున్న రాకేష్‌ జల్సాలకు ఎక్కువగా ఖర్చులు చేశాడని వివరిస్తున్నారు. రాజకీయ నాయకుడి మాదిరిగా వైట్‌ అండ్‌ వైట్‌ ధరించడం, కార్లలో తిరగడం చేస్తూ డబ్బు ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఇతడి గతం, తాజా వ్యవహారాలను ఆరా తీస్తున్న పోలీసులు  విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు