అత్తింటి వేధింపులకు అబల బలి 

19 Nov, 2018 09:57 IST|Sakshi
లావణ్య మృతదేహం

సిరికొండ: అత్తింటి వారి వరకట్న వేధింపులకు అబల బలైన సంఘటన మండలంలోని పాకాల గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ బషీర్‌అహ్మద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బదావత్‌ లావణ్య(25) బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. ఇందల్‌వాయి మండలం వెంగల్‌పహాడ్‌కు చెందిన లావణ్యకు, పాకాలకు చెందిన బదావత్‌ నవీన్‌తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. లావణ్యను భర్త తరచూ అదనపు కట్నం కోసం వేధించేవాడని తెలిపారు. శనివారం ఉదయం భార్యభర్తలకు గొడవ జరిగింది. దీంతో లావణ్య ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం గ్రామంలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం వారి పొలం వద్ద బావిలో మృతదేహం తేలింది. అటువైపు వెళ్లినవారు శవాన్ని చూసి కుటుంబీకులకు సమాచారం అందించారు.

లావణ్య శవాన్ని చూసిన భర్త కుటుంబీకులు పరారయ్యారు. లావణ్య మృతి వార్త తెలిసిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు వెంగల్‌పహాడ్‌ నుంచి భారీగా తరలివచ్చారు. సంఘటన స్థలాన్ని ధర్పల్లి సీఐ ప్రసాద్, సిరికొండ, ధర్పల్లి ఎస్‌ఐలు బషీర్‌అహ్మద్, పాండేరావు సందర్శించారు. మృతురాలి పుట్టింటి వారు ఎలాంటి గొడవలు చేయకుండా పోలీసులు వారించారు. మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయించి తహసీల్దార్‌ అంజయ్యతో పంచనామా చేయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో గొడవలు జరగకుండా ఉండటానికి పోలీసులు రాత్రి వరకు అక్కడే బందోబస్తుగా ఉన్నారు. లావణ్య ఆత్మహత్యకు భర్త, అత్తమామలు, మరిది, ఆడపడుచు కారణమని తండ్రి లావుడ్య శ్రీరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు