ఫార్మసీ విద్యార్థి కిడ్నాప్‌ కలకలం

4 Jul, 2018 08:43 IST|Sakshi
చిత్రంలో లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు, ఇన్‌సెట్‌లో లక్ష్మీ ప్రసన్న

తనను కిడ్నాపర్స్‌ చంపేస్తారని వాట్సాప్‌ ద్వారా సమాచారం

వేగవంతంగా కదిలిన పోలీసు యంత్రాంగం

సీసీ ఫుటేజీల ఆధారంగా ఆచూకీపై ఆరా

నంద్యాలలో చిక్కిన యువతి?

కడప అర్బన్‌ : కడప నగరంలో ఓ యువతి కిడ్నాప్‌ అయిందనే సంఘటన మంగళవారం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మాత్రం కళాశాలకు వెళ్లాల్సిన యువతి.. ఓ ఆటోలో వెళ్లి, తర్వాత ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో బురఖా ధరించి, బ్యాగ్‌తో కడప ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి కర్నూలు బస్సెక్కి నంద్యాలలో దిగినట్లు తెలిసింది. ఈ సంఘటనపై యువతి తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. కడప నగరం జయనగర్‌ కాలనీలో నివసిస్తున్న డి.వెంకారెడ్డి, యల్లమ్మకు డి. మహాలక్ష్మి, డి.లక్ష్మీప్రసన్న అనే ఇద్దరు కుమార్తెలు వున్నారు. వీరు కడప నగర శివార్లలోని నిర్మల కళాశాలలో డి–ఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. మహాలక్ష్మి కళాశాలకు బస్సులో వెళ్లింది.

లక్ష్మీప్రసన్న మాత్రం తాను ఇంటి దగ్గరి నుంచి నడుచుకుంటూ వెళ్లి పద్మావతి స్వీట్స్‌ సమీపంలో ఆగివున్న ఓ ఆటో (ఏపీ04 టీయూ 1337)ను ఎక్కింది. సదరు ఆటోలో కడప నగర శివారులోని కొండాయపల్లె రోడ్డులో వున్న ప్రైవేట్‌ స్కూల్‌కు వెళ్లి.. అక్కడ దిగి ఆటో డ్రైవర్‌కు రూ. 30 ఇచ్చి పంపించేసింది. తర్వాత అక్కడి నుంచి కడప ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంది. తరువాత కర్నూలు బస్సెక్కి నంద్యాలలో దిగినట్లు తెలు స్తోంది. ఈ క్రమంలోనే ఉదయం 10:16 గంటల కు తన అక్క మహాలక్ష్మి సెల్‌ఫోన్‌కు వాట్సాప్‌ ద్వారా ‘తాను ఆపదలో వున్నానని, కాపాడాలని’ మెసేజ్‌ చేసింది. ఈ మెసేజ్‌ చూసి కంగారు పడిన ఆమె అక్క తల్లిదండ్రులు, బంధువులతో కలిసి కడప డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు.

వేగవంతంగా పోలీసు దర్యాప్తు
కడప డీఎస్పీ కార్యాలయం చేరుకున్న యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కడప డీఎస్పీ షేక్‌ మాసుంబాషా, తమ సిబ్బందితో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి విచారణ కోసం పంపించారు. మరో వైపు కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ ఫుటేజీలలో లక్ష్మీప్రసన్న తాను కళాశాలకు వెళ్లేందుకు అప్సరా సర్కిల్‌లో పద్మావతి స్వీట్స్‌ వద్ద ఆటోలో ఎక్కినట్లు కనిపించింది. తర్వాత కడప ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద బస్సు ఎక్కేందుకు వచ్చి, బురఖా ధరించింది. బురఖాపైన లక్ష్మీప్రసన్న వేసుకున్న బ్యాగ్, చెప్పులను పరిశీలించి గుర్తించారు. సదరు యువతి కర్నూలు బస్సెక్కి వెళ్లిందని గమనించారు. 

నంద్యాలలో పోలీసులకు చిక్కిన యువతి? 
కిడ్నాప్‌ కలకలం సృష్టించిన యువతి కొన్ని గంటల్లోనే నంద్యాలలో ప్రత్యక్షమైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడికి తానొక్కతే వెళ్లిందా? ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లిందా? అనే విషయాలపై పోలీసు బృందం ప్రత్యేకంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. సదరు యువతిని కడపకు తీసుకుని వస్తున్నట్లు సమాచారం. 

యువతి అదృశ్యం కేసుగా నమోదు 
లక్ష్మీప్రసన్న, తన అక్క మహాలక్ష్మి సెల్‌ఫోన్‌కు తా ను ఆపదలో వున్నానని మెసేజ్‌ పెట్టడంతో కంగా రు పడిన ఆమె తల్లిదండ్రులు చిన్నచౌక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు చిన్నచౌక్‌ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనలో ప్రాథమికంగా ఆటోను, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు