ఆ ముగ్గురి మోసమే కొంపముంచింది

1 Sep, 2019 07:47 IST|Sakshi
డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్యపై ఎంపీ అనురాధకు వివరిస్తున్న రూరల్‌ సీఐ భీమరాజు 

వైద్యుడి సూసైడ్‌ నోట్‌లో గుండెలు పిండేసే నిజాలు.. ఆత్మహత్య అంటే మరణాన్ని కోరుకోవడం కాదు.. బతకాలనే కోరికకు, బతకలేని నిస్సహాయతకు మధ్య పెనుగులాట... నన్ను రక్షించండంటూ... వేడుకొనే ఓ ఆర్తనాదం...ఆత్మహత్య చేసుకునేవారి స్థితిపై మానసిక నిపుణుల విశ్లేషణ... అమలాపురం వైద్య కుటుంబ విషాదం విషయంలో ఇది నిజం. వారు చేసిన అప్పు కొంతైతే...నమ్మించి కాటేసిన నమ్మక ద్రోహుల వెన్నుపోట్లు ఉన్నాయి. తమ ముగ్గురి మరణాలకు మరో ముగ్గురి మాయమాటలే కారణమని వైద్యుడు కృష్ణ సందీప్‌ తన నోట్‌లో ఆత్మహత్య చేసుకునే ముందు ఆవేదనా భరితంగా రాసుకున్నాడు. మా జీవితాలు ఇంత సిల్లీగా ముగిసిపోతాయని మేమెప్పుడూ ఊహించలేదు...మా నాన్నగారి అతి మంచితనమే మా తనువులను తుంచేది.

సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి)  పట్టణంలో సంచలనం కలిగించిన డాక్టర్‌ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్యకు రైస్‌ పుల్లింగ్‌ ముఠా  సభ్యులు ముగ్గురు చేసిన మోసమే ప్రధాన కారణమని ఆయన పెద్దకుమారుడు డాక్టర్‌ కృష్ణసందీప్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ ద్వారా తెలుస్తోంది. దానివల్లే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ కుటుంబం ఆత్మహత్య దిశగా అడుగులు వేసింది. డాక్టర్‌ కృష్ణ సందీప్‌ తమ సూసైడ్‌ నోట్‌లో ‘మా జీవితాలు ఇంత సిల్లీగా ముగిసిపోతాయని మేమెప్పుడు ఊహించలేదు.. నాన్నగారు అందరినీ సునాయాసంగా నమ్మేస్తారు. అందుకే కొందరి చేతుల్లో ఘోరంగా మోసపోయారు. చివరకు హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు నాన్నగారిని నమ్మించి రూ.ఐదు కోట్ల వరకూ మోసం చేశారు.’ అని పేర్కొన్నారు. ఈ నోట్‌లో కృష్ణ సందీప్‌ తమ తండ్రి మంచితనం, అందరినీ నమ్మే గుణాన్ని ఉటంకిస్తూ అప్పులు చేసే ముందు... ఏవేవో నమ్మకాలతో ఎవరివెరినో నమ్మే ముందు కుటుంబ సభ్యులమైన తమతో చర్చించకుండా తీసుకున్న నిర్ణయాల వల్లే తమ కుటుంబానికి ఇంతటి దారుణమైన ముగింపు వచ్చిందని రాశారు.

‘హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు నాన్నగారిని రైస్‌పుల్లింగ్‌తో మీ అప్పులన్నీ తీరిపోయి ధనిక స్థితి వస్తుందని సెంట్‌మెంట్‌తో నమ్మించారు’ అని డాక్టర్‌ కృష్ణ సందీప్‌ నోట్‌లో పేర్కొన్నారు. ‘బియ్యాన్ని ఆకర్షించే విగ్రహం లేదా దైవానికి సంబంధించిన వస్తువును మీ వద్ద ఉంచుకుంటే అది మీ జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తుంద’ని రైస్‌పుల్లింగ్‌ ముఠా సభ్యులు నమ్మిస్తారు.   అత్యంత మహిమ కలిగినది అంటూ విగ్రహం లేదా దైవానికి సంబంధించిన వస్తువు చుట్టూ బియ్యాన్ని వలయాకారంలో ఉంచుతారు. కొన్ని శాస్త్రీయ ప్రక్రియలతో ఆ బియ్యం అయస్కాంతానికి ఇనుము ఆకర్షించబడినట్టు ఆ విగ్రహం లేదా వస్తువు వద్దకు వచ్చేస్తాయి. అలా హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మోసగాళ్లు డాక్టర్‌ రామకృష్ణంరాజును ఈ రైస్‌ పుల్లింగ్‌లోకి లాగారు. వారికి ఆయన ఒకసారి రూ.రెండు కోట్లు, మరోసారి రూ.3 కోట్లు  ఇచ్చారు.

ఈ రైస్‌ పుల్లింగ్‌లో నిలువునా మోసపోయిన రామకృష్ణంరాజు ఈ రూ.5 కోట్ల కోసం  అప్పులు చేశారు. బ్యాంక్‌లు, ప్రైవేటు ఫైనాన్సర్లనుంచి ఈ రుణాలు తీసుకున్నారు. ఈ ఒత్తిడి పెరగడానికి   తోడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగిన ఆయనకు అది కూడా  కలసి రాలేదు. అప్పుల భారం తడిసి మోపెడయ్యింది. ఇదే విషయాన్ని డాక్టర్‌ కృష్ణ సందీప్‌ సూసైడ్‌ నోట్‌లో అత్యంత దీనంగా వివరించారు. ‘అసలు మా అమ్మ, మా ఇద్దరి అన్నదమ్ముల సంతకాలు లేకుండా నాన్న గారి ఒక్క సంతకంతో మా ఆస్తులన్నీ కోల్పోవలసిందేనా?’ అని ఆయన ఆవేదనగా అక్షరరూపంలో ఆడిగారు. ‘ఎవరినీ క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాం’ అంటూ కృష్ణ సందీప్‌ ఆ నోట్‌లో సంతకం చేసి తన ఉత్తరాన్నే కాదు.. జీవితాన్నే ముగించారు. 

రైస్‌పుల్లింగ్‌ ముఠా కోసం హైదరాబాద్‌కు పోలీసు బృందాలు
డాక్టర్‌ రామకృష్ణంరాజును రైస్‌పుల్లింగ్‌ పేరుతో మోసం చేసిన ముగ్గురు వ్యక్తుల కోసం గాలించేందుకు మూడు పోలీసు బృందాలను తెలంగాణ రాష్ట్రానికి పంపించారు. రామకృష్ణంరాజు స్వస్థలమైన కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చిలకలపేటకు కూడా ఓ పోలీసు బృందాన్ని పంపించారు. సూసైడ్‌ నోట్‌లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి పేర్లను డాక్టర్‌ కృష్ణ సందీప్‌ రాశారు. ఆ సూసైడ్‌ నోట్‌ను డాక్టర్‌ రామ కృష్ణంరాజు బంధువుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా లోతుగా  విచారణ చేస్తున్నారు. కాగా నాన్న, అమ్మ, అన్నయ్య మరణాలతో చిన్న కుమారుడు కృష్ణవంశీ కోలుకోలేకపోతున్నారు. బంధువులు అతనికి మానసిక ధైర్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. డాక్టర్‌ కుటుంబ సభ్యుల మృతదేహాలను శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాత్రి పది గంటలకు పోస్టు మార్టం పూర్తయ్యాక మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృత దేహాలకు రాజమహేంద్రవరం రోటరీ శ్మశాన వాటికలో శనివారం దహన సంస్కారం చేశారు.  

ఎంపీ అనురాధ పరామర్శ
అమలాపురం టౌన్‌: డాక్టర్‌ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దయనీయమని ఎంపీ చింతా అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె డాక్టర్‌ రామ కృష్ణంరాజు ఇంటిని శుక్రవారం సాయంత్రం సందర్శించి డాక్టర్‌ రెండో కుమారుడు కృష్ణ వంశీని పరామర్శించి ఓదార్చారు. అప్పటికీ అక్కడే ఉన్న డాక్టర్, ఆయన భార్య, పెద్ద కుమారుడు మృత దేహాలను చూసి చలించారు. డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను రూరల్‌ సీఐ ఆర్‌.భీమరాజు ఎంపీ అనురాధకు వివరించారు. ఆమె వెంట వైఎస్సార్‌ సీపీ నాయకుడు, న్యాయవాది తాళ్ల సాంబమూర్తి తదితరులు ఉన్నారు.
చదవండి : వైద్య వనంలో విషాదం..

మరిన్ని వార్తలు