కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌ 

16 Oct, 2018 01:21 IST|Sakshi
ఆభరణాలను పరిశీలిస్తున్న సైబరాబాద్‌ కమిషనర్‌ వి.సి. సజ్జనార్‌ , నిందితుడు పఠాన్‌ మహబూబ్‌ ఖాన్‌

      81 కేసుల్లో నిందితుడు 

      87 తులాల నగలు స్వాధీనం 

హైదరాబాద్‌: కరుడుగట్టిన ఓ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్‌ చేసినట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌ తెలిపారు. సోమవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీ జానకి షర్మిల, శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌తో కలసి వివరాలు వెల్లడించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు చంద్రబాబు, సుధీర్, సత్యనారాయణ, టి.శ్రీనివాస్, ఏఎస్‌ఐ రవీందర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుళ్లు సత్తయ్య, ప్రవీణ్‌ కుమార్, దశరథ్, రాంకుమార్‌లను కమిషనర్‌ ప్రశంసించారు. వివరాలు... అనంతపురం జిల్లాలోని గుల్జారీపేట్‌కు చెందిన పఠాన్‌ మహబూబ్‌ఖాన్‌ అలియాస్‌ పఠాన్‌ అలియాస్‌ పఠాన్‌ జహీర్‌ఖాన్‌(42) చాం ద్రాయణగుట్టలోని బాబానగర్‌లో నివాసముంటున్నాడు.

రెండు దశాబ్దాలుగా చోరీలకు పాల్పడుతున్నాడు. నిందితుడి వద్ద నుంచి 87 తులాల బంగారు నగలు, రెండు కిలోల 160 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్, రాచకొండ, సూర్యాపేట, బెంగ ళూర్‌లలో 20 కేసులు, ఆంధ్రప్రదేశ్‌ 11, తెలంగాణ 22, కర్ణాటకలో 28 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 10 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2005లో ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశా రు. ఆ తర్వాత ఆరేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. చోరీ చేసిన సొత్తును చార్మినార్, బెంగళూర్‌లోని శివాజీనగర్‌లో విక్రయించేవాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. విలాసవంతమైన జీవితం గడిపేవాడు.
 
ఉదయం పూటే చోరీలు.... 
తాళం వేసి ఉన్న ఇళ్లపై పఠాన్‌ రెక్కీ నిర్వహిస్తాడు. ఉదయం 9 గంటల సమయంలో ఇంటికి చేరుకుంటాడు. వీ ఆకారంలో ఉండే రాడ్, స్క్రూ డ్రైవర్‌ను ఎవరికీ కనిపించకుండా తన వెంట తెచ్చుకుంటాడు. తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి అందినకాడికి నగలు, నగదు చోరీ చేసి ఉడాయిస్తాడు. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధుల్లో క్లూస్‌ టీం సేకరించిన వేలిముద్రల ద్వారానే చోరీలకు పాల్పడింది పఠాన్‌గా నిర్ధారించారు. అతడు 9 సెల్‌ ఫోన్లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో తాళం పగులగొట్టి 47 తులాల ఆభరణాలను పఠాన్‌ చోరీ చేశాడు. చోరీ కేసుల్లో పఠాన్‌ ముగ్గురు సోదరులు, ఇద్దరు బావ మరుదులు నిందితులుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎవరికి వారే చోరీలు చేస్తుంటారని, రక్త సంబంధీకులు, బంధువుల్లో ఎవరిని ఎవరూ నమ్మరు. ఎవరు, ఎక్కడ నివాసముంటున్నారనే విషయాన్ని కూడా చెప్పుకోరు. పోలీసులు అరెస్ట్‌ చేస్తే మాత్రం వారి భార్యలు కోర్టులను ఆశ్రయిస్తారు. 

తాళం వేస్తే పీఎస్‌లో సమాచారమివ్వండి... 
ఇళ్లకు తాళం వేసి పండుగ సెలవుల్లో ఎవరైనా ఊళ్లకు వెళితే సంబంధిత పీఎస్‌లో సమాచారమివ్వాలని కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. విలువైన ఆభరణాలు ఇంట్లో పెట్టవద్దని, బ్యాంక్‌ లాకర్లలో ఉంచాలని, ఇళ్ల ముందు సీసీ కెమెరా అమర్చుకోవాలని సూచించారు. సైబరాబాద్‌ పరిధిలో గతంలో 5 వేల కెమెరాలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 50 వేలకు పెరిగిందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సాంకేతిక సీసీ కెమెరాలపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. 

మరిన్ని వార్తలు