రోడ్డుపై నుంచి.. వంతెనలో..

11 Nov, 2019 13:21 IST|Sakshi
డివైడర్‌ మధ్య వంతెనలో వేలాడుతున్న లారీ

అదుపు తప్పి డివైడర్‌లోకి దూసుకెళ్లిన లారీ

వంతెన మధ్యలో గాల్లో వేలాడుతున్న వైనం

రెప్పపాటులో తప్పిన ముప్పు  

స్వల్పగాయాలతో బయటపడిన లారీ డ్రైవర్, క్లీనర్‌  

గూడూరు: జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ రెప్పపాటులో డివైడర్‌ మధ్య వంతెనలోకి దూసుకెళ్లింది. లారీడ్రైవర్‌కు నిద్ర ముంచుకురావడంతో కళ్లు మూతలు పడి.. తెరుచుకునే లోగా.. డివైడర్ల మధ్యలో వంతెన గోడలకు తగులుకుని వేలాడుతోంది. అయితే ఆ లారీలోని డ్రైవర్‌తో పాటు, క్లీనర్‌కూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ముప్పు తప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాలకు చెందిన లారీ చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున ఆదిశంకర కళాశాల కూడలి ప్రాంతం వద్ద ఉన్న డివైడర్‌ వద్దకు చేరుకునే సరికి డ్రైవర్‌ నిద్ర ఆపుకోలేకపోయాడు. కళ్లు మూత పడడంతో అదుపుతప్పిన లారీ డివైడర్‌ను ఢీకొని వంతెన మధ్యలో తలకిందులుగా పడిపోయింది.

వంతెన గోడలను తగులుకుని వేలాడుతూ కనిపించింది. అయితే అందులోని డ్రైవర్‌ రాజా, క్లీనర్‌ హుస్సేన్‌ లారీలోంచి దిగి బయట పడ్డారు. అయితే లారీ వంతెన లోపల పడిపోయి ఉంటే.. ప్రాణనష్టం జరిగేదని తెలుస్తోంది. వంతెనలో నీళ్లు ఉన్నాయి. లారీ ముందు భాగం అందులో మునిగిపోయి ఉండేది. అదే సమయంలో ఆ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న గూడూరు రూరల్‌ ఎస్సై పుల్లారావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన వారిని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు