కర్మకాండలకు వెళ్లొస్తూ అనంత లోకాలకు..

28 May, 2020 10:27 IST|Sakshi
హనుమంతరావు (ఫైల్‌) శ్రీనివాసరావు (ఫైల్‌)

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్‌

పర్చూరుకు చెందిన అన్నదమ్ములు దుర్మరణం

కారంచేడు మండలం దగ్గుబాడు సమీపంలో ప్రమాదం

ప్రకాశం, కారంచేడు: ఆ తండ్రికి నలుగురు కొడుకులు.. అందరూ డ్రైవింగ్‌నే వృత్తిగా ఎంచుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి రిటైర్‌ అయిన తండ్రి గతంలోనే కాలం చేయగా ఆయన కుమారుల్లో ఇద్దరు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇటీవల చనిపోయిన తోటి ఉద్యోగి కర్మకాండలకు వెళ్లొస్తున్న సోదరులను టిప్పర్‌ రూపంలో మృత్యువు బలితీసుకుంది. మండలంలోని దగ్గుబాడు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ఊపిరి వదిలారు. అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటం, వారిలో ఒకరి పుట్టిన రోజు కూడా కావడంతో వారి స్వగ్రామం పర్చూరులో తీవ్ర విషాదం అలముకుంది.  

స్థానిక ఎస్‌ఐ బి.నరసింహారావు తెలిపిన వివరాల మేరకు.. చీరాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేసిన చెరుకూరి జగన్మోహనరావు పర్చూరులో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు.  పదవీ విరమణ అనంతరం జగన్మోహనరావు మృతి చెందగా ఆయన భార్య కూడా ఇటీవలే కాలం చేసింది. ఆయన నలుగురు కుమారులు కూడా అందరూ డ్రైవర్లుగానే స్థిరపడ్డారు. వీరిలో పెద్ద కుమారుడు కోటేశ్వరావు పర్చూరులో స్కూల్‌ బస్సు డ్రైవర్, రెండవ కుమారుడు హనుమంతరావు చీరాల ఆర్టీసీ డ్రైవర్, మూడవ కుమారుడు పర్చూరులో స్కూల్‌ బస్సు డ్రైవర్, చిన్నకుమారుడు చీరాలలోని టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల చినగంజాంకు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ శ్రీనివాసరావు మృతి చెందగా బుధవారం ఆయన దశ దిన ఖర్మకు హాజరయ్యేందుకు చీరాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న హనుమంతరావు (53) ఆయన తమ్ముడు శ్రీనివాసరావు(51) ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో ఇంకొల్లు వైపు నుంచి పర్చూరు వస్తుండగా పర్చూరు వైపు నుంచి ఇంకొల్లు వైపు వెళ్తున్న టిప్పర్‌ మండలంలోని దగ్గుబాడు కోల్డ్‌ స్టోరేజీ సమీపంలో వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హనుమంతరావు, శ్రీనివాసరావు ఇద్దరూ ఎగిరి రోడ్డుపై పడి తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే రోజు ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడం, రెండు కుటుంబాలు వీధిన పడటంతో పర్చూరులో విషాదఛాయలు అలముకున్నాయి. హనుమంతరావుకు భార్య, వివాహాలు అయిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావుకు భార్య, వివాహాలు అయిన ఇద్దరు కుమార్తెలున్నారు.

పుట్టిన రోజు మృత్యు ఒడికి..
బుధవారం శ్రీనివాసరావు పుట్టినరోజు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత పుట్టిన రోజు వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుందామని చెప్పాడు. తల స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకొని వెళ్లిన భర్త విగత జీవిగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. అన్నతో కలిసి ఇంటికి బయలుదేరిన శ్రీనివాసరావును టిప్పర్‌ రూపంలో మృత్యువు కబళించిందని గ్రామస్తులు వాపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ బి.నరసింహారావు వివరాలు సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు