ప్రమాదాలపై పోలీసుల కీలకనిర్ణయం!

23 May, 2018 11:25 IST|Sakshi

పంజాబ్‌లో ప్రయోగాత్మక చర్య 

ఎంవీ యాక్ట్, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ పక్కాగా అమలు 

ఈ విధానం సిటీలోను ఉండాలంటున్న నిపుణులు 

రోడ్డు ప్రమాదాల నివారణకు పంజాబ్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలకు కారణమైన వారి డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేయించే చర్యలకు ఉపక్రమించారు. పైలట్‌ ప్రాజెక్టుగా జలంధర్‌ పట్టణంలో అమలు చేస్తున్న అధికారులు త్వరలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. మోటారు వాహన చట్టంతో పాటు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో ఉన్న సెక్షన్లను సైతం పక్కాగా అమలు చేస్తున్నారు. దీనికి అక్కడి ఆర్టీఏ అధికారుల నుంచి పూర్తి సహకారం అందుతోంది. హైదరాబాద్‌ నగరంలో పెరుగుతున్న వాహన ప్రమాదాల దృష్ట్యా.. ఆ విధానం ఇక్కడా అమలు చేయాలంటున్నారు నిపుణులు.     

సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి వాహనచోదకుల్లో బాధ్యత పెంచడమే మార్గంగా భావించిన పంజాబ్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలకు కారణమైన వారి డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేయించే చర్యలకు ఉపక్రమించారు. పైలెట్‌ ప్రాజెక్టుగా అక్కడి జలంధర్‌ పట్టణంలో దీన్ని అమలు చేస్తున్నారు. ఇలాంటి విధానం నగరంలో ఉండాలని నిపుణులు చెబుతుండగా... ఇప్పటికే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారి విషయంలో దీన్ని అమలు చేస్తున్నామని ట్రాఫిక్‌ పోలీసులు అంటున్నారు. వాతావరణ కారణాలు, రోడ్డు స్థితిగతుల వల్ల చోటు చేసుకునే ప్రమాదాలను మామూలుగానే పరిగణిస్తున్న పంజాబ్‌ అధికారులు డ్రైవర్‌ నిర్లక్ష్యం, అవగాహనా రాహిత్యంతో పాటు మద్యం మత్తులో జరిగిన వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అక్కడి ఆర్టీఏ అధికారుల నుంచీ పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి.  

ఆ ‘రెండు చట్టాలు’ ఏం చెబుతున్నాయంటే.. 
నిర్లక్ష్యంగా వాహనం నడపడం ద్వారా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడటానికి, మృతి చెందటానికి, అంగవైకల్యం పొందడానికి కారణమైన వాహన చోదకుడి లైసెన్సును రద్దు చేసే అవకాశం అధికారులకు భారత మోటారు వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్‌)తో పాటు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్లు కూడా కల్పిస్తున్నాయి. ఎంవీ యాక్ట్‌లోని సెక్షన్‌ 19 ప్రకారం ఓ వ్యక్తి డ్రైవింగ్‌ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే లైసెన్స్‌ రద్దు చేసే లేదా రెన్యువల్‌కు నిరాకరించే అవకాశం ఉంది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 304–ఏ (నిర్లక్ష్యంతో మృతికి కారణం కావడం), 279 (బహిరంగ రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం), 337 (నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల భద్రతకు ముప్పుగా మారడం), 338 (నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఇతరులు తీవ్రంగా గాయపడటానికి కారణం కావడం) సెక్షన్ల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లైసెన్సును కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటి ఆధారంగానే జలంధర్‌ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఏళ్లుగా ఈ విధానం అమలులో ఉంది. అక్కడ లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతూ చిక్కితే జరిమానాలు, శిక్షలు భారీ స్థాయిలో ఉండడంతో క్యాన్సిల్‌ అయిన వ్యక్తి వాహనం తీసే సాహసం చేయడని, ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవని అధికారులు చెబుతున్నారు. 

సిటీలో అమలుకు సవాళ్లెన్నో.. 
ఇలాంటి కఠిన విధానాలు కేవలం మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కిన వారి విషయంలోనే కాకుండా ప్రమాదాలకు కారణమైన వారి పైనా ఉండాలని నగర ట్రాఫిక్‌ పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే అమలుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయంటున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆర్టీఏ అధికారుల వద్ద ఉన్న డేటాబేస్‌ ఎంతో కీలకం. అయితే ఇది అన్ని అవసరాలకు వినియోగించేలా, అన్ని స్థాయిల్లోనూ యాక్సిస్‌ చేసేందుకు అవసరమైన పరిజ్ఞానం అందుబాటులో రావాలని సూచిస్తున్నారు. మరోపక్క ఓ వ్యక్తి లైసెన్స్‌ను క్యాన్సిల్‌ చేసినా పేరు లేదా ఇంటి పేరులో కొన్ని అక్షరాలను మార్చడం ద్వారా అదే వ్యక్తి మరోసారి లైసెన్స్‌ తీసుకునే అవకాశం ఉండకూడదని, ప్రస్తుతం ఆధార్‌ లింకేజ్‌లో ఇది సాధ్యమవుతుందంటున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో లైసెన్స్‌ వివరాలు సైతం సామాజిక భద్రతా కార్డుల్లో నిక్షిప్తమై ఉండడంతో వారు ఇలా తీసుకునే అవకాశం ఉందని, ఇక్కడ అలాంటి వ్యవస్థ లేదని చెబుతున్నారు. డేటాబేస్‌తో పాటు ఇతర సమస్యలను అధిగమించి జలంధర్‌ విధానాన్ని సిటీలోనూ అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు