ఎఫిడ్రిన్‌ టు కేటమైన్‌!

8 May, 2019 08:29 IST|Sakshi
నిందితులు శివరాజ్, కన్నన్‌ (ఫైల్‌) కేటమైన్‌ (ఫైల్‌)

వెలుగులోకి వస్తున్న ఇంకెమ్‌ ఎండీ లీలలు

సోమవారం అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు

అంతర్జాతీయ డ్రగ్‌ రాకెట్‌లో కీలకంగా గుర్తింపు

సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటక రాజధాని బెంగళూరులో చిక్కిన అంతర్జాతీయ కేటమైన్‌ రాకెట్‌లో నగరానికి చెందిన ఇంకెమ్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ వెంకటేశ్వర్లు పాత్ర కీలకమని వెలుగులోకి వచ్చింది. 2009లో ఎఫిడ్రిన్‌ తయారీ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోకు (ఎన్సీబీ) చిక్కిన ఇతను జైలుకు వెళ్లాడు. ఇప్పుడు కేటమైన్‌ కేసులో మరోసారి కటకటాల్లోకి చేరాడు. గత గురువారం ఎన్సీబీకి బెంగళూరులో పట్టుబడిన ఇద్దరు నిందితుల విచారణలో వెంకటేశ్వర్లు  పేరు వెలుగులోకి రావడంతో నగరానికి వచ్చిన ప్రత్యేక బృందం ఇక్కడి ఎన్సీబీ యూనిట్‌ సాయంతో నాచారంలో దాడులు నిర్వహించింది. ఫలితంగా ఇంకెమ్‌ ల్యాబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఏకంగా 477 కేజీల కేటమైన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన ఎన్సీబీ అధికారులు సోమవారం అతడిని అరెస్టు చేశారు. ఇక్కడి కోర్టులో హాజరుపరిచి ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ వారెంట్‌పై బెంగళూరుకు తరలించారు. డేట్‌ డ్రగ్, రేప్‌ డ్రగ్, సెక్స్‌ డ్రగ్‌గానూ పిలిచే కేటమైన్‌ వాడకంతో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ప్రధానంగా స్టడ్‌ ఫామ్స్‌లో గుర్రాలకు దీనిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. బెంగళూరులోని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) యూనిట్‌కు గత మంగళవారం కేటమైన్‌ స్మగ్లింగ్‌పై కీలక సమాచారం అందడంతో అక్కడి మూవీలాండ్‌ థియేటర్‌ సమీపంలో దాడి చేసిన అధికారులు కేటమైన్‌ స్వాధీనం చేసుకున్నారు.

లోతుగా ఆరా తీసిన నేపథ్యంలో బెంగళూరులోని కెంగేరి శాటిలైట్‌ టౌన్‌ ప్రాంతానికి చెందిన శివరాజ్‌ ఆ డ్రగ్‌ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడి ఇంటిపై దాడి చేసిన ఎన్సీబీ టీమ్‌ అక్కడ ఓ కేటమైన్‌ తయారీ యంత్రాన్ని స్వాధీనం చేసుకుంది. శివరాజ్‌ విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆధారంగా  ఈ డ్రగ్‌ను ఖరీదు చేస్తున్న చెన్నై వాసి జె.కన్నన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. శివరాజ్‌ విచారణలోనే హైదరాబాద్‌కు చెందిన ఇంచెమ్‌ సంస్థ ఎండీ వెంకటేశ్వర్లు ద్వారా ఈ కేటమైన్‌ తయారీ తనకు తెలిసిందని వెల్లడించాడు. అతడి ఫ్యాక్టరీలో ఇలాంటి తయారీ యంత్రం మరోటి ఉన్నట్లు చెప్పడంతో బెంగళూరు నుంచి గత గురువారం వచ్చిన ప్రత్యేక ఎన్సీబీ టీమ్‌ హైదరాబాద్‌ యూనిట్‌ అధికారులతో కలిసి నాచారంలో ఉన్న ఇంకెమ్‌ సంస్థపై దాడి చేసింది. ఈ సందర్భంగా 477 కేజీల కేటమైన్‌తో పాటు తయారీ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని సంస్థను సీజ్‌ చేసింది.

ఈ సంస్థకు చెందిన రిజిస్టర్డ్‌ కార్యాలయం సనత్‌నగర్‌లో ఉండటంతో అక్కడకు వెళ్లిన అధికారులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీబీ దాడి చేసిన సమయంలో ఇంకెమ్‌లో మొత్తం 17 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో ఎనిమిది మంది రెగ్యులర్, మిగిలిన వారు కాంట్రాక్ట్‌ కార్మికులు. వీరిలో ఎవ్వరికీ తాము నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్నామనే విషయం తెలియదు. దీంతో ఎన్సీబీ అధికారులు వీరిని విచారించి వదిలేశారు. శివరాజ్‌కు కేటమైన్‌ తయారీకి అవసరమైన ముడిసరుకును వెంకటేశ్వర్లు సరఫరా చేస్తున్నట్లు ఎన్సీబీ గుర్తించింది. ఫార్మా రంగానికి చెందిన రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో లైసెన్స్‌ తీసుకుని ఇంకెమ్‌ సంస్థను ఏర్పాటు చేసిన వెంకటేశ్వర్లు దాని ముసుగులో డ్రగ్‌ తయారు చేస్తున్నాడు. దేశీయ మార్కెట్‌లో కేజీ రూ.3.5 లక్షలు ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ధర రూ.35 లక్షల వరకు ఉంటోంది. ఈ డ్రగ్‌ మాఫియా ఉత్పత్తి చేసిన కేటమైన్‌ను చెన్నై మీదుగా దక్షిణాసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియా, మలేషియాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు