మాఫియా డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

22 Jun, 2020 03:52 IST|Sakshi

సూత్రధారి భరత్‌ తుక్రాల్‌ అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో మరో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు అయ్యింది. ఆదివారం అమీర్‌పేట్‌ ప్రాంతంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 105 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్, 25 గ్రాముల హషిష్‌ ఆయిల్, 4 బ్లాట్స్‌ ఎల్‌ఎస్‌డీ, 250 డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అలాగే 2 కార్లు, ఒక బైక్, 7 మొబైల్‌ ఫోన్ల స్వాధీనంతోపాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్‌ రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న మధురానగర్‌కు చెందిన భరత్‌ తుక్రాల్‌(48)తోపాటు బల్కంపేట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రాణాప్రతాప్‌(29), షేక్‌ ఫిరోజ్‌ అహ్మద్‌(29)ను అరెస్టు చేశారు. డ్రగ్స్‌ రవాణాకు వినియోగించిన రెండు కార్లను, ఓ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏ డ్రగ్స్‌ను బెంగళూరుకు చెందిన జేమ్స్, ఢిల్లీకి చెందిన జెమీ, చెన్నైకు చెందిన అబ్దుల్‌ వద్ద కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.

జేమ్స్, జెమీ, అబ్దుల్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నార న్నారు. కేసు తదుపరి విచారణ కోసం అమీర్‌ పేట్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించినట్లు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అంజి రెడ్డి తెలిపారు. కాగా, నిందితులు నగరంలోని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలకు నిషే ధిత డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు