గ‘మ్మత్తు’గా..

28 May, 2018 11:08 IST|Sakshi
ఇటీవల గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడిన నిందితులు (ఫైల్‌)

కరీంనగర్‌క్రైం : బంగారు కలలతో కరీం‘నగరం’లో అడుగుపెడుతున్న యువత అడ్డదారులు తొక్కుతున్నారు. మత్తుపదార్థాలకు బానిసవుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో సరదాగా మొదలై వ్యసనపరులుగా మారుతున్నారు. జల్సాలకు అలవాటుపడి గంజాయిని నగరాలకు తరలిస్తున్నారు. పోలీసులకు చిక్కడంతో ఉన్నతమైన భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.

సరిహద్దు ప్రాంతాల నుంచి..

ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతాలనుంచి గంజాయిని పట్టణాలను తీసుకొస్తున్నారు. జగిత్యాల, మంథని, సిరిసిల్ల, గోదావరిఖని, మంచిర్యాల డివిజన్లలో గంజాయి జోరుగా సాగవుతున్నట్లు సమాచారం. దీనిని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, హుజురా బాద్, గోదావరిఖని డివిజన్లలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడ వాటిని చిన్నచిన్న పొట్లాలుగా మార్చి అమ్ముతున్నారు. హుక్కాకు అలవాటు పడిన వారుసైతం గంజాయికి ఆకర్షితులవుతున్నారు. గంజాయితో సిగరేట్లు తయారు చేసి పలు దుకాణాల్లో కోడ్‌ పేర్లతో విక్రయిస్తున్నట్లు తెలిసింది.

నగరంలో విస్తరిస్తున్న గంజాయి

కరీంనగర్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా విస్తరిస్తున్నట్లు సమాచారం. తిరుమలనగర్, శేషామహల్, కమాన్‌ ప్రాంతం, హౌసింగ్‌బోర్డు కాలనీ, అంబేద్కర్‌స్టేడియం, డ్యాం పరిసరాల్లో, బైపాస్‌ రోడ్డుల్లో కొందరు కొందరు ముఠాగా ఏర్పడి ప్యాకెట్లుగా మార్చి గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం. వీరికి విద్యార్థులు చిక్కుకుంటున్నారని తెలిసింది. ఈ మధ్య ఓ విద్యార్థి తరచు అనారోగ్యానికి గురి కావడంతో వైద్యపరీక్షలు చేయగా గంజాయికి అలవాటు పడినట్లు తెలిసింది. ఇతడి మిత్రులు సుమారు 20 మందికి గంజాయి అలవాటు ఉందని సదరు విద్యార్థి తెలపడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. గంజాయి అమ్మకం దారులు 100 గ్రాముల ప్యాకెట్‌ను రూ. 5000కు విక్రయిస్తున్నట్లు సమచారం. ఇలా నిత్యం రూ. 50వేల వరకు వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది.

టాస్క్‌ఫోర్స్‌ దాడులు

టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిన నాటి నుంచి మత్తు పదార్థాల అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతోంది. సుమారు 250 మంది విద్యార్ధులు గంజాయికి అలవాటు పడ్డారని గుర్తించి వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. తాజాగా వారంక్రితం 8, 9వ తరగతి విద్యార్ధులు కూడా గంజాయికి అలవాటు పడ్డారని గుర్తించారు. వీరికి వెంటనే కౌన్సెలింగ్‌ నిర్వహించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మొదట గంజాయికి అలవాటు పడి అమ్మకందారుడిగా అవతామెత్తిన ఇంటర్‌ విద్యార్థిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక పక్క టాస్క్‌ఫొర్స్‌ దాడులు చేస్తుండడంతో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి గంజాయి సేవిస్తున్నారని సమాచారం. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది.

డ్రగ్స్‌ కూడా...

జిల్లాలో డ్రగ్స్‌ మూలాలు బయటపడడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. నగరంలో 2012 ఆగస్టు 2న కొకైన్‌ సరఫరా చేస్తూ ముగ్గురు విద్యార్థులు దొరికిన సంఘటన తెలిసిందె. భాగ్యనగర్‌కు చెందిన పల్లె ప్రశాంత్‌(20), జ్యోతినగర్‌కు చెందిన న్యాలకొండ దీక్షిత్‌(19), పెద్ది నవీన్‌(17) అనే విద్యార్థులు 2 గ్రా. కొకైన్‌తో పట్టుబడ్డారు. రాష్ట్ర రాజధానిలో పోలీసుల నిఘా పెరగడంతో కరీంనగర్‌ కేంద్రంగా అమ్మకాలు చేసేందుకు డ్రగ్స్‌మాఫియా ప్రణాళికలు సిద్ధం చేసిందని సమాచారం. ఈ మధ్యకాలంలో హైదారాబాద్‌లో డ్రగ్స్‌ ముఠాలను ఎక్సైజ్‌ ఎన్‌ఫొర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్న వారిలో కొందరు కరీంనగర్‌కు చెందిన వారు కూడా ఉన్నారని తెలిసింది. 

ప్రకటనకే పరిమితమైన అవగాహన

గతంలో డ్రగ్స్‌ ఆనవాల్లు బయటపడినప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్న పలువురి వ్యాఖ్యలు ప్రకటనకే పరిమతమయ్యాయి. కాలేజీల్లో పెడదోవ పడుతున్న వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిం చాలని  తల్లిదండ్రులు కోరుతున్నారు.
కొన్ని లక్షణాలు...

  • వీటికి అలవాటు పడిన వారు నరాల బలహీనత, మెదడు మొద్దుబారడం, ఇతర వ్యవస్థలు నియంత్రణలో ఉండకపోవడం, శరీరం తేలికపడినట్లు అయి కొద్ది సమయం వరకూ తెలియని కొత్తశక్తి వచ్చినట్లు అవుతుంది. 
  • మొదట నాడి వ్యవస్థ, మెదడు, కండరాల వ్యవస్థలపై ప్రభావం చూపి తర్వాత మనిషి తన ఆధీనం కోల్పోయి వెలుగును చూడలేడు, అధిక శబ్ధాలను వినలేడు. తరచూ మత్తు పదార్థాలు తీసుకునేందు కు ప్రయత్నిస్తారు.
  • ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు, ఎవరితో సరిగా మాట్లాడడు తనకు కావాల్సిన డ్రగ్స్, గంజాయి లభించకపోతే సైకోలాగా తయారువుతా రు.
  • ఇంట్లోవారు లేదా మిత్రులు వీరిని గమనిస్తే చాలా తేడాలు కనిపిస్తాయి. వెంటనే వైద్యం సహాయం అందిస్తే త్వరగా బయటపడే అవకాశాలుంటాయి

సీపీ కమలాసన్‌రెడ్డి
గంజాయి అమ్మకాలు చేసే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. గతంలో పట్టుబడ్డ వారికి వారి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చాం. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రప్రభావం, నష్టాలపై అవగాహక సదస్సులు ఏర్పాటు చేస్తాం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా