వీరు మారరంతే..!

16 Sep, 2019 09:03 IST|Sakshi

డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడుతున్న వారిలో బైకర్లే  ఎక్కువ

తర్వాతి స్థానాల్లో ఫోర్‌ వీలర్స్, త్రీవీలర్స్‌

కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆగని డ్రంకన్‌డ్రైవ్‌లు

సాక్షి, సిటీబ్యూరో: వీకెండ్‌ వచ్చిదంటే చాలు...ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో బైకర్లు మద్యం మత్తులో తేలిపోతున్నారు. పార్టీలు, విందులు, వినోదాల్లో పాల్గొని స్నేహితులతో కలిసి హుషారైన పాటలు పాడుతూ...తూలుతూ అతి వేగంతో దూసుకెళుతున్నారు. సెప్టెంబర్‌ తొలి, రెండు వారాంతాల్లో 441 మంది డ్రంకన్‌ డ్రైవర్లను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడగా వారిలో 302 మంది బైకర్లే ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఫోర్‌ వీలర్స్‌ 106 మంది, త్రీవీలర్స్‌ 30, లారీ డ్రైవర్లు ముగ్గురు ఉన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నా వాహనచోదకుల్లో మార్పు రావడం లేదు. తాగి వాహనాలు నడపడం మన ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను ఫణంగా పెట్టడమేనని చెప్పినా, కేసు నమోదుచేయడమే కాకుండా జైలుకు పంపినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. 

బైకర్లు మారాలి...
డ్రంకన్‌ డ్రైవ్‌ కేసుల్లో ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కుతున్న వారిలో యువకులే ఎక్కువగా ఉంటున్నారు. కాలేజీకి వెళ్లే విద్యార్థులు నుంచి ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల వరకు మద్యం సేవించి వాహనం నడుపుతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నగరంతో పాటు శివార్లలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అతివేగంతో పాటు డ్రంకన్‌ డ్రైవ్‌ కారణంగానే జరుగుతున్నాయని పోలీసులు నిర్ధారిస్తున్నా వాహనచోదకుల్లో మార్పు రావడం లేదు. మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ ప్రకారం డ్రంకన్‌ డ్రైవ్‌లో చిక్కినవారు ఇంట్లో వారికి సరైన సమాచారం ఇవ్వకుండానే జైల్లో గడిపి వెళుతున్నట్లుగా   తేలింది. మద్యం తాగిన వ్యక్తులు క్యాబ్‌లు, ఆటోలు లేదా ప్రజారవాణా వ్యవస్థ ఉపయోగించుకుంటే అందరికీ మంచిదని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.  

సెప్టెంబర్‌ తొలి వారాంతం     రెండో వారంలో
బైకర్లు –157                   బైకర్లు –145                  
ఫోర్‌వీలర్‌:–62                ఫోర్‌వీలర్ః–44    
త్రీవీలర్‌–16                   త్రీవీలర్‌–14
లారీ ట్రక్కు–2                 లారీట్రక్కు–1
మొత్తం...237                మొత్తం...204

మరిన్ని వార్తలు