‘మానాన్న పోలీసు.. మానాన్న మాజీ ఎంపీ’ ! 

18 Mar, 2019 09:46 IST|Sakshi

అర్ధరాత్రి తప్పతాగి ఇద్దరు యువకుల వీరంగం  

సాక్షి, హైదరాబాద్‌ ‌: అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలో నడి రోడ్డుపై మద్యం మత్తులో పోలీసు అధికారి, మాజీ ఎంపీ తనయులమంటూ ఇద్దరు యువకులు హల్‌ చల్‌ చేశారు. దారిన పోయే వారిని అటకాయిస్తూ గొడవకు దిగారు. అమీర్‌పేట కీర్తి అపార్ట్‌మెంట్‌ సమీపంలో శనివారం అర్ధరాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తూ నానా హంగామా సృష్టించారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి అశోక్‌ తాను పనిచేస్తున్న హైటెక్‌ సిటీ ప్రాంతం నుంచి శనివారం రాత్రి 1.45 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా అడ్డుకొని అగ్గిపెట్టె కావాలని అడగగా... తన వద్ద లేదని చెప్పడంతో దాడి చేశారని తెలిపాడు.

ఒకరు తాను ఏసీపీ కుమారుడినని, మరో యువకుడు తాను మాజీ ఎంపీ కొడుకునంటూ కొట్టారని తెలిపాడు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అశోక్‌ను అటకాయించిన యువకులు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడ కూడా హంగామా చేశారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని బ్రీతింగ్‌ ఎనలైజర్‌ ద్వారా పరీక్షించి చర్యలు తీసుకోకపోగా ముందుగా వచ్చిన బాధితుడి సెల్‌ ఫోన్‌ తీసుకుని అతడిని స్టేషన్‌లోనే ఉంచారు. ఆ తరువాత వచ్చిన యువకులని వెళ్లిపోవాలని ఆదేశించారు. 

ఆదివారం మధ్యాహ్నం వరకు అశోక్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నట్లు తెలిసింది. అయితే రాత్రి జరిగిన సంఘటన మొత్తం  సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉండటంతో వాటిని సేకరించిన బాధితుడి స్నేహితులు వాటిని ప్రసార మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. రాత్రి రోడ్డుపై గొడవ పడిన వారిలో ఏపీసీ, మాజీ ఎంపీ కుమారులు ఎవరూ లేరని ఎస్‌ఆర్‌ నగర్‌ ఇన్స్‌పెక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. అది చిన్నపాటి ఘర్షణ కావడంతో అశోక్, రాహుల్‌ అనే వ్యక్తిపై పెట్టి కేసు నమోదు చేశామన్నారు. 


 

మరిన్ని వార్తలు