విషాదం: డీఎస్పీ తలలోంచి దూసుకెళ్లిన బుల్లెట్..

29 Jan, 2018 17:02 IST|Sakshi
మృతిచెందిన డీఎస్పీ బల్జీందర్‌ సింగ్‌ సంధు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, చంఢీగఢ్‌: ప్రమాదవశాత్తూ సర్వీస్‌ రివాల్వర్‌ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్‌ ఓ డీఎస్పీ ప్రాణాలు బలిగొంది. ఈ ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది. ఐజీ ముఖ్విందర్‌ సింగ్‌ కథనం ప్రకారం.. జైతూలోని యూనివర్సిటీ కాలేజీలో నేడు (సోమవారం) విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.మోరల్‌ పోలీసింగ్‌ మీద విద్యార్థులు ఆందోళన చేస్తూ.. పోలీసుల నుంచి మాకు, సామాన్యులకు స్వాతంత్ర్యం కావాలంటూ విద్యార్థులు గట్టిగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపుతప్పుతుందని సమాచారం అందుకున్న పంజాబ్‌కు చెందిన డీఎస్పీ బల్జీందర్‌ సింగ్‌ సంధు వర్సిటీకి చేరుకున్నారు.

ఆందోళన విరమించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డీఎస్పీ బల్జీందర్‌ సింగ్‌ విద్యార్థులను హెచ్చరించారు. కానీ విద్యార్థులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ ఆందోళనను ఉధృతం చేశారు.ఈ క్రమంలో అక్కడ తుపాకీ పేలిన శబ్ధం వినిపించిందని, పోలీసులు గమనించేసరికి డీఎస్పీ తలలొంచి దూసుకెళ్లడంతో ఆయన కుప్పకూలిపోయారు.అదే బుల్లెట్‌ మరో పోలీసును తీవ్రంగా గాయపరించింది. వీరిని చికిత్స నిమిత్తం ఫరీద్‌కోట్‌లోని గురు గోవింద్‌ సింగ్‌ మెడికల్‌ హాస్పిటల్‌కు తరలించారు. డీఎస్పీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందారని నిర్ధారించారు. బుల్లెట్‌ గాయమైన మరో పోలీసుకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. సర్వీస్‌ రివాల్వర్‌ను డీఎస్పీ పేల్చారా.. లేక విద్యార్థులు వినియోగించారా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఐజీ ముఖ్విందర్‌ సింగ్‌ వివరించారు.

మరిన్ని వార్తలు