అత్యాచార సంఘటనపై డీఎస్పీ విచారణ

17 Apr, 2019 12:05 IST|Sakshi
జగ్గంపేట మండలం రామవరం రంగవల్లినగర్‌లో బాలికపై జరిగిన అత్యాచార సంఘటనపై విచారణ చేస్తున్న డీఎస్పీ రామారావు, సీఐ రాంబాబు తదితరులు

తూర్పుగోదావరి  ,జగ్గంపేట: మండలంలోని రామవరం గ్రామ పరిధిలోని రంగవల్లినగర్‌లో సోమవారం రాత్రి మూడేళ్ల బాలికపై మేనమామ జరిపిన అత్యాచార సంఘటనపై పెద్దాపురం డీఎస్పీ రామారావు విచారణ నిర్వహించారు. రంగవల్లినగర్‌లో బాధిత బాలిక ఇంటి వద్దకు స్థానిక సీఐ రాంబాబు, ఎస్సై రామకృష్ణ తదితరులతో మంగళవారం ఉదయం వెళ్లి కుటుంబ సభ్యులు, స్థానికులను విచారించారు. విశాఖ జిల్లా నర్సింగపల్లికి చెందిన నలబోను వెంకన్న తన చెల్లెలు ఇంటికి చుట్టపు చూపునకు వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మేనకోడలైన మూడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి నిందితుడిని బం«ధించి పోలీసులకు సమాచారమివ్వడంతో వారు స్థా«నిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ బాలికకు మెరుగైన వైద్యం అందిస్తుండడంతో కోలుకుంటోంది. ఇదిలా ఉండగా డీఎస్పీ రామారావు రంగవల్లినగర్‌లో సంఘటన జరిగిన ఇంటిని పరిశీలించి స్థానికులను విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలికపై అత్యాచారంపై కేసు నమోదు చేశామని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలి
జగ్గంపేట: రామవరం రంగవల్లినగర్‌ కాలనీలో మూడేళ్ల బాలిక పై అత్యాచారానికి పాల్పడిన మేనమామ విశాఖ జిల్లా నర్సింగపల్లికి చెందిన నలబోను వెంకన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం, ఏపీ రైతు కూలీ సంఘం డిమాండ్‌ చేశాయి. రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు ఆధ్వర్యంలో మంగళవారం జగ్గంపేటలో ట్రావెలర్స్‌ బంగ్లా నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా సంత మార్కెట్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బాలిక  కుటుంబానికి న్యాయం చేయాలని, మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ తండ్రిలా చూసుకోవల్సిన మేనమాన కర్కశంగా చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడడం దారుణమన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితుడికి కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్డులో కేసు త్వరగా విచారణ జరిగేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రగతి శీల మహిళా సంఘం(స్త్రీ విముక్తి) నాయకురాలు దేవి, దుర్గ, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు కర్నాకుల రామలింగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బి.రమేష్, పీడీఎస్‌యూ(విజృంభణ ) జిల్లా కార్యదర్శి కె.సతీష్, వరదరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు