ప్రేమ పేరుతో వేదిస్తున్నందుకే హత్య

25 Jul, 2019 11:03 IST|Sakshi

సాక్షి, కళ్యాణదుర్గం(అనంతపురం) : కంబదూరు మండల కేంద్రంలో ఎరికల రవి హత్య మిస్టరీ వీడింది. వివాహితను ప్రేమ పేరుతో వేధించినందువల్లే బాధితురాలి సోదరుడు తన స్నేహితులతో కలిసి రవిని అంతమొందించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మల్లికార్జున తన కార్యాలయంలో రూరల్‌ సీఐ శివశంకర్‌ నాయక్‌తో కలిసి మీడియాకు వెల్లడించారు.

కంబదూరుకు  చెందిన ఎరికల రవి తండ్రి ఎరికల ముత్యాలప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఎరికల రవి ఆటో నడుపుకుంటూ కళ్యాణదుర్గం మండలం దాసంపల్లికి చెందిన వివాహితను ప్రేమ పేరుతో వేధించేవాడు. సదరు వివాహిత తనకు ఎదురవుతున్న వేధింపులను సోదరుడు బోయ సీతారాములకు చెప్పుకుని విలపించింది. ఈ విషయంలో సోదరునితో పాటు సోదరుని స్నేహితులు కలిసి ఎరికల రవిని పలుమార్లు హెచ్చరించి ప్రేమపేరుతో వేధించడం మానుకోవాలని హెచ్చరించారు.

అయినా రవి ప్రవర్తనలో మార్పు రాలేదు. తన సోదరికి ఎదురవుతున్న వేధింపుల గురించి సీతారాములు స్నేహితులైన దాసంపల్లి మొగలి రామాంజినేయులు, మాదిగ సురేష్‌ల వద్ద చెప్పుకుని బాధపడ్డాడు. పథకం ప్రకారం ముగ్గురు ఈ నెల 19న కంబదూరుకు వెళ్లి ఎరికల రవి బర్త్‌డే సందర్భంగా డిన్నర్‌ ఇవ్వాలని కోరారు. సదరు ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంలో ఎరికుల రవిని ఎక్కించుకుని కంబదూరులోని వైఎన్‌హెచ్‌ కోట రోడ్డులో ఉన్న ఈడిగ గౌరమ్మ కల్లు దుకాణం వద్దకు వెళ్లి ఫూటుగా మద్యం తాగారు.

రాత్రి 10.30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఎరికల రవితో గొడవకు దిగారు. పథకం ప్రకారం తెచ్చుకున్న మచ్చు కొడవళ్లతో అక్కడే హతమార్చారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు సీతారాములు, మొగలి రామాంజనేయులు, మాదిగ సురేష్‌లను డీఎస్పీ ఆదేశాల మేరకు కంబదూరు మండలం నూతిమడుగు బస్టాండ్‌ వద్ద అరెస్టు చేశారు. వీరివద్ద ఉన్న రెండు మచ్చుకొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు.    

మరిన్ని వార్తలు